– సీపీఐ(ఎం) నాయకులపై ఎస్‌ఐ దౌర్జన్యం
– మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు
నవతెలంగాణ-మోతె
డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అనర్హులను చేర్చారని, అర్హులకు న్యాయం చేయాలని నిరసన తెలిపిన పేదలు, సీపీఐ(ఎం) నాయకులపై ఎస్‌ఐ దౌర్జన్యం చేశారు. ఇండ్ల వద్ద బైటాయించిన మహిళలను ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని విభాలపురం అవాసంనాగయ్యగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వస్తారని తెలిసింది. లబ్దిదారుల లిస్టులో అనర్హులున్నారన్న సమాచారంతో మామిళ్ల్లగూడెం నుంచి వచ్చే దారిలో విభాలపురం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో లబ్దిదారులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బుర్కచర్ల నుంచి వస్తున్నారని తెలిసి లబ్దిదారులు డబుల్ బెడ్ రూమ్స్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు ఈడ్చిపడేశారు. ముందుగా అర్హులైన లబ్దిదారులకు లిస్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అతికించారని, ఆ తర్వాత దాన్ని రద్దు చేసి 12 మంది అనర్హులను చేర్చినట్టు ఆరోపించారు. వారికి అండగా ఉన్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, నాయకులపై పోలీసులు దాడి చేశారు. ఈడ్చుకెళ్తూ పిడిగుద్దులు గుద్దారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాకపోయినా స్థానిక నాయకులు అధికారులు లేకుండానే ఇండ్లను ప్రారంభించారు. పని ముగించుకొని బయటికి వెళ్తున్న స్థానిక అధికార పార్టీ నాయకులను లబ్దిదారులు అడ్డుకుని.. తమకు న్యాయం చేయాలని అంతవరకు బయటికి పోనీయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ.. తనపై, ప్రజలపై దాడి చేసిన మోతె ఎస్‌ఐ మహేష్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విభాలపురం, రావిపహాడ్, మోతెలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల నుంచి రూ.7వేలు వసూలు చేశారని ఆరోపించారు. ‘డబుల్’ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో అవినీతి, అక్రమాలు జరిగాయని అధికారులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పట్టించుకోలేదన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసే వరకు పేదల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముల్కూరు గోపాల్‌రెడ్డి, సభ్యులు నాగంమల్లయ్య, డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు వెలుగుమధు, చేగువేరా, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మైనంపాటి వీరారెడ్డి, ఉపాధ్యక్షులు సామిరెడ్డి నవీన్‌రెడ్డి, పనస శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.