వివాదాస్పద పదవీ విరమణ చట్టాన్ని నిరసిస్తూ

ఫ్రాన్స్‌వ్యాప్తంగా నిరసనల వెల్లువ
ప్రదర్శనల్లో పాల్గొన్న 5లక్షల మందికి పైగా ఆందోళనకారులు
పారిస్‌ : పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64కి పెంచుతూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మళ్ళీ నిరసనలు మొదలయ్యాయి. ఫ్రెంచి యూనియన్ల ఆధ్వర్యంలో మంగళవారం వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగాల్సిన ప్రక్రియను పక్కకు నెట్టి ఏప్రిల్‌లో మాక్రాన్‌ ఈ కొత్త చట్టాన్ని వివాదాస్పద రీతిలో ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను ప్రతిఘటిస్తూ అన్ని ప్రధాన యూనియన్లు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 250 కేంద్రాల్లో 5లక్షల మందికి పైగా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి తన నిరసన తెలియచేశారు. రాజధాని పారిస్‌ వీధుల్లో లక్ష మందికి పైగా ప్రదర్శన నిర్వహించారు. పారిస్‌ ప్రదర్శనలో వామపక్ష యూనియన్‌ సిజిటి ప్రధాన కార్యదర్శి సోఫీ బినెట్‌ మాట్లాడుతూ, అంచనాలను తలకిందులు చేసేలా ప్రజా సమీకరణలు వున్నాయని అన్నారు. ఈ నెల 24న చర్చలకు రావాల్సిందిగా నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షురాలు తనను ఆహ్వానించారని చెప్పారు. అయితే జూన్‌8లోగానే తాను ఆమెతో సమావేశమై ఈ బిల్లుపై పార్లమెంట్‌లో ఓటింగ్‌కు అనుమతించాల్సిందిగా కోరనున్నట్లు చెప్పారు. ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఫాబియన్‌ రౌసెల్‌ కూడా ఈ పిలుపును సమర్ధించారు. మాంట్‌పెలియర్‌లో జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శనలో రౌసెల్‌ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో తమ ఓటు హక్కును వినియోగించు కోవాలనుకుంటున్నామని చెప్పారు. నిరసనల కారణంగా కొన్ని విమానాలు, రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.