కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల నిర్విర్యం, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, ఆదిలాబాద్ జిల్లాకు జరిగిన అన్యాయంపై బుధవారం కలెక్టరేట్ ఎదుట కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు హోరెత్తించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తుందన్నారు. కార్మికుల 44 చట్టాలను నాలుగు కోడ్లుగా… రైతులకు అన్యాయం చేసేల మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కేంద్ర బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు. జిల్లాలో టెక్స్టైల్ పార్కు, రైల్వేలైన్ విమానాయశ్రయం. సీసీఐ పునరుద్దరణ, పారిశ్రామిక కారిడార్ వంటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికి కూడా కేంద్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ ఎంపీ వీటి సాధనకు కృషి చేయాలని, అప్పటి వరకు కార్మిక, రైతు సంఘాలతో ధర్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో నాయకులు లంక రాఘవులు, బండి దత్తత్రి, ఆశన్న, అగ్గిమల్ల స్వామి, లోకారి పోశెట్టి, జగన్ సింగ్, చిలక దేవిదాస్, అశోక్, వెంకట నారాయణ, లింగాల చిన్నన్న, సురేందర్, గణేష్, కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.