గర్వంగా ఉంది

Proudస్రవంతి మూవీస్‌ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్‌ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘కిడ’. తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు. ఆర్‌.ఎ.వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూ రాము, కాళీ వెంకట్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌.ఎ.వెంకట్‌ మాట్లాడుతూ, ‘సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉన్నప్పటికీ అందులో ఎమోషన్స్‌కే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారనే విషయాన్ని నేను నమ్ముతాను. పల్లెటూరు, అందులో మేకలు పెంచుకునే ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్‌ చేస్తూ ఎమోషనల్‌గా ఓ కథను రాసుకున్నాను. ఈ కథ విన్న వేణు అనే నిర్మాత స్రవంతి రవికిశోర్‌కి చెప్పారు. ఆయన పూర్తి కథను ఆడియో రూపంలో వివరించి పంపమన్నారు. అది విన్న ఆయన ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పడంతో షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే స్టార్స్‌తో మూవీస్‌ చేసిన రవికిశోర్‌ తమిళంలో నా సినిమాతో నిర్మాతగా అడుగు పెట్టారు. రవికిశోర్‌ తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్‌ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంటుంది. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆడియెన్స్‌ నుంచి స్టాండింగ్‌ ఓవేషన్‌ వచ్చింది. తర్వాత చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్స్‌ వచ్చాయి. మెల్‌బోర్న్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ స్క్రీనింగ్‌ చేస్తే స్టాండింగ్‌ ఓవేషన్‌ వచ్చింది. మా అమ్మగారైతే ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమోషనల్‌ పాయింట్‌తోనే రెడీ చేసిన ఓ లైన్‌ స్రవంతి రవికిశోర్‌కి చెప్పాను. ఆయనకు నచ్చింది. దాన్నొక స్టార్‌ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’ అని చెప్పారు.