– ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : సీఈవో వికాస్‌రాజ్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు తగిన సౌకర్యాలు కల్పించి, ఎన్నికలు సజావుగా సాగటానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనీ, లేదంటే 800 మంది ఓటర్లు దాటిన ప్రతి పోలింగ్ స్టేషన్‌కూ ఒక అదనపు పోలింగ్ అధికారిని కేటాయించాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి ఆహారం, కనీస సౌకర్యాలు కల్పించడానికి కఠినమైన ఆదేశాలను జారీ చేయాలని తెలిపారు. గత ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మహిళా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోని పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు ఏకరూప వేతనం చెల్లించాలని సూచించారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో రూ.2,400 అంతకంటే ఎక్కువ చెల్లించగా, కొన్నింటిలో రూ.1,600 చెల్లించారని గుర్తు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అశాంతి నెలకొందని తెలిపారు. వచ్చేనెల 13న రిసెప్షన్ సెంటర్ నుంచి పోలింగ్ సిబ్బందికి వారి నివాస స్థలాలకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, శారీరక వైకల్యం ఉన్న వారు, ఏడాదిలోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయించాలనీ, జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అర్హత కలిగిన పోలింగ్ సిబ్బంది అందరికీ తుది శిక్షణా తరగతి రోజే పోస్టల్ బ్యాలెట్ అందజేసి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగించాలని సూచించారు. ఈ అంశాలను పరిశీలించి, డీఈవోలకు అవసరమైన సూచనలను జారీ చేయాలని తెలిపారు.