ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పేస్కేల్‌ ఇప్పించండి

– రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి : మంత్రి డాక్టర్‌ సీతక్కకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టంలో భాగంగా పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పేస్కేల్‌ వర్తింపజేయాలని తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క)కు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్‌, ఎం.నారాయణగౌడ్‌ వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో 2006 నుంచి ఏడు వేల మంది ఫీల్డు అసిస్టెంట్లు పనిచేస్తున్నారని తెలిపారు. కనీస వేతనం అడిగితే ఉద్యోగాల్లో నుంచి గత ప్రభుత్వం తీసేసిందనీ, ఎన్నికల ముందు మళ్లీ విధుల్లోకి తీసుకున్నదని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వేతనాలు పెంచుతామనీ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చిందని గుర్తుచేశారు. పైస్థాయి ఉద్యోగులకు పేస్కేలు ప్రకటించి ఫీల్డు అసిస్టెంట్లకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సర్క్యూలర్‌ 4779ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనాలను రూ.26వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి ఇచ్చే రూ.8 వేల అలవెన్సులను ఫీల్డ్‌ అసిస్టెంట్లకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.