– పెండింగ్ వేతనాలు బిల్లులను విడుదల చేయండి
– ఆ దిశగా బడ్జెట్‌లో నిధులు కేటాయించండి : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవితాంతం కష్టపడి పనిచేసేటోళ్లు వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉద్యోగులకు మాదిరిగానే పెన్షన్ పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రతి నెలా కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికుల నుంచి కొంత అమౌంట్‌ను తీసుకునీ, దానికి మరికొంత ప్రభుత్వం కలిపి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకురావాలని విన్నవించారు. గురువారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయనీ, వాటి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫామ్‌హౌజ్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, సొసైటీల ముసుగులో ల్యాండ్ సీలింగ్ అర్ధాన్నే మార్చేశారని వాపోయారు. సొసైటీల పేరుతో ఎన్ని ఎకరాలనైనా ఉంచుకోవచ్చుననేది సరిగాదని సూచించారు. ఎక్కువ ఆస్తులు గల వారి నుంచి సంపద పన్ను ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చునన్నారు. కేంద్రం నుంచి తగిన నిధులు రావట్లేదని అనిపిస్తున్నదనీ, వాటిని రాబట్టుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్‌ఎమ్‌లకు పెండింగ్ వేతనాలు లేకుండా చూడాలని కోరారు. ఒకటి రెండు నెలల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. హోంగార్డులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. పనిఒత్తిడి తగ్గించేందుకు పోలీసులకు షిప్టుల వారీగా డ్యూటీ వేయాలనీ, ఫలితంగా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించ వచ్చునని ప్రభుత్వానికి సూచించారు. ఇల్లు, వైద్యం, విద్య, పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తే పేదలకు న్యాయం చేసినట్టు అవుతుందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయండి : అక్బరుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ..2018 నుంచి పెండింగ్‌లోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సభను కోరారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సూచించిన 37 రికమండేషన్స్‌ను అమలు చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా నిధులివ్వాలని విన్నవించారు. ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్పుల సమస్యనూ పరిష్కరించాలని కోరారు. స్పౌస్ బదిలీలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలను పునరుద్దరించాలని సూచించారు. ఓల్డ్‌సిటీలో మెట్రో లైన్‌కు శంకుస్థాపన చేయాలని కోరారు. పాతబస్తీలోని సమస్యలను
హామీలకు దేశబడ్జెట్ కూడా సరిపోదు : మహేశ్వర్‌రెడ్డి
బీజేఎల్పీనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు దేశబడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు. రుణమాఫీ ఎలా చేస్తారు? రైతు బంధు ఇస్తారా? బోనస్ సంగతేంటి? అని ప్రశ్నించారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఇండ్లకు ఇందిరమ్మ ఫొటోతో పాటు వాజ్‌పేయి ఫొటోనూ పెట్టాలని సూచించారు. వనరులు ఏవిధంగా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు.
కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాన్చిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుందంటూ మహేశ్వర్‌రెడ్డి అనటంతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. చర్చలో కాంగ్రెస్ సభ్యులు కె.సత్యనారాయణ, రాజ్‌ఠాకూర్, తదితరులు మాట్లాడారు.