మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం హర్షణీయం : ఆప్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం పట్ల ఆప్‌ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్‌ యమునా గౌడ్‌లు హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌తో కలసి వారు మాట్లాడారు. హేమ జిల్లోజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయానికి ఆప్‌ మ్యానిఫెస్టోనూ కాపీ కొట్టడమే కారణమని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఉచిత విద్య, వైద్యం, నీరు, విద్యుత్తు, మహిళలకు ఉచిత రవాణా, నెలవారీ భత్యం గురించి ఆప్‌ చేసిన వాగ్దానాలు సక్రమంగా అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. తమ పార్టీ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినా సరే…. వాటిని సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆప్‌ అధికార ప్రతినిధి అఫ్సహా, నేతలు మౌనిక, వైశాలి తదితరులు పాల్గొన్నారు.