Artificial intelligence సహాయంతో పెద్ద మొత్తంలో డాటాను ఉపయోగిస్తూ, జెనెటిక్ ప్రొఫైలింగ్ సహాయంతో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్‌లను డిజైన్ చేసుకుంటూ, minimally invasive technologiesతో సర్జరీలను, రికవరీలను సులభతరం చేస్తూ, స్టెమ్ థెరపీలతో పాడైపోయిన శరీర భాగాలను రిజెనెరేట్ చేస్తూ కొత్త తరహా వైద్య విధానాలతో మోడెర్న్ మెడిసిన్ ఒకవైపు దూసుకుపోతున్న సందర్భంలో ఈరోజు మనం ఉన్నాం. (AI, జెనెటిక్ ప్రొఫైలింగ్ వంటి వాటి సహాయంతో ఒక పేషంట్‌కి ఏం మందు ఏ విధంగా పని చేస్తుందో తెలుసుకుని ఆ మందు ఆ వ్యక్తి వాడాలా వద్దా అన్నంత precision భవిష్యత్తులో రాబోతోంది).
ఐనా గానీ సామాన్య ప్రజలలో గుండె జబ్బుల విషయంలో అవగాహనలకూ అభివద్ధి చెందుతున్న వైద్య విధానాలలోని trendsకు మధ్య చాలా అంతరం ఉంది. ఈ అవగాహనా లోపం వలన ఆకస్మిక మరణాన్ని కలిగించే జబ్బులుగా గుండె జబ్బులు ఈరోజుకీ ముందు వరుసలో ఉండిపోతున్నాయి. Deaths related to heart attacks తగ్గాలంటే మనముందు ఉన్న ఏకైక మార్గం ఈ జబ్బులపై అవసరమైనంత మేరకు అవగాహనను ప్రజానీకంలో పెంచడం. ‘అవసరమైనంత మేరకు’ అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు గుండెలో నొప్పి వొస్తే ఏం చేయాలి అని ఎవరినైనా అడిగితే సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోల పుణ్యమా అని ఎవరికి తోచింది వారు చెప్పడం మొదలుపెడుతున్నారు కానీ, ఎవరూ సకాలంలో డాక్టర్ దగ్గరికి పోవడం ఏవిధంగా ప్రాణాలను కాపాడుతుందో చెప్పే నాథుడు లేకపోవడం కనిపిస్తుంది. అంటే అనవసరమైన చాలా విషయాలను ప్రజలు నేర్చుకున్నారే తప్ప అవేవీ వాళ్ళ ప్రాణాలను కాపాడవనే విషయం తెలుసుకోకపోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా సామాన్య ప్రజానీకానికి ఏది సైన్సు? ఏది న్యూసెన్స్? అనేది తెలియడం కష్టతరమౌతోంది కూడా.
ఒకవైపు వైద్య సంబంధ టెక్నాలజీ, సైన్సులో మనం దూసుకుపోవడం… మరో వైపు సోషల్ మీడియా తాలూకు సొంత వైద్యాలు పెరిగి ప్రజలను అజ్ఞానపుటంచుల్లోనే కాకుండా కత్తి అంచున ప్రాణాలను నిలపడం వంటి విచిత్ర పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే జ్ఞానం ఒకవైపు పెరుగుతుంటే అందుకు సమాంతరంగా అజ్ఞానం మరోవైపు పెరుగుతుంది. మన సమాజంలో జ్ఞానం నిటారుగా vertical గా పెరగటం, అజ్ఞానం horizontalగా పెరగటాన్ని గమనించవచ్చు. WHO వంటి సంస్థలు గుండె జబ్బుల విషయంలో అలారాలు మోగిస్తున్నాగానీ దానిపై చర్చ కానీ రావలసినంత అవేర్‌నెస్ గానీ సామాన్య ప్రజానీకంలో రాలేదు. ఒక సమస్య గురించి అతి సామాన్య మానవుడు కూడా అవసరమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ఆ సమస్యకు సంబంధించిన అవగాహన ప్రజానీకంలో పెరిగింది అని చెప్పగలం. ఈ రోజు గుండె జబ్బులకు సంబంధించిన సింపుల్ ప్రశ్నలను ఎవరైనా సామాన్య జనాన్ని అడిగి చూడండి. అవగాహన పెంచడంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో, రోజు రోజుకీ ఎంతగా వెనుకకు నెట్టేయబడుతున్నామో తెలిసిపోతుంది.
అంతేకాకుండా ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సూత్రం ఆధారంగా అసలు గుండె జబ్బులు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై, అంటే preventionపై కూడా పెద్దగా చర్చలు, అవగాహన సభలు లేవు. మన జనాభాలో సిగరెట్ స్మోకింగ్ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది అనేది బేరీజు వేస్తే, అలాగే మన జనాభాలో కొవ్వు పదార్థాల వినియోగం ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అని బేరీజు వేస్తే ఎందుకు గుండె జబ్బులు పెరుగుతున్నాయో బేసిక్ అవగాహన వస్తుంది. ఇవి రెండే కాక అసలు సమాజంలో స్ట్రెస్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంతగా పెరిగిపోయింది? పని ఒత్తిడి, ఆర్థిక సంబంధమైన ఒత్తిడి, పిల్లల్లో చదువుకు సంబంధించిన ఒత్తిడి ఎందుకంతగా పెంచబడుతోంది? ఇటువంటి అంశాలన్నీ ఆబ్జెక్టివ్‌గా డేటా ఆధారంగా అనలైజ్ చేస్తే preventionలో మనం ఎందుకు వెనుకబడ్డామో ఎంత అవగాహన రాహిత్యంలో ఉండిపోతున్నామో అర్థమౌతుంది.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎంత అవసరమో డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్ లు చేసుకోవడం… ముఖ్యంగా మధుమేహం, హై బీపి ఉన్న వారు, కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు చెకప్‌లు చేసుకోవడం చాలా అవసరం. కానీ వాటిని కూడా పట్టించుకునే స్థితిలో మనం లేం. పైగా డాక్టర్ల అవసరమే లేదనే తప్పుడు అవగాహనను ప్రజల్లో పెంచుతున్నారు. మరోవైపు ఈ జబ్బులపై విపరీతమైన భయాలను పెంచుతున్నారు. అవగాహన బదులు భయాలను పెంచడం వలన మంచి జరుగకపోగా చెడే జరుగుతుంది. ఈ భయాలను ఆధారం చేసుకుని సూడో సైన్స్ మాత్రమే కాకుండా కార్పొరేట్ వైద్య వ్యవస్థలు కూడా దోపిడీ చేయడం మొదలుపెట్టాయి. దీనిపై ప్రభుత్వాల పూర్తి స్థాయి నిర్లక్ష్య వైఖరి, దీనిని కంట్రోల్ చేసే మెకనిజం మనకు ఎక్కడా కనిపించదు.
ఐతే ప్రజలకు మాత్రం స్మార్ట్ ఫోన్లు రూపంలో వస్తున్న టెక్నాలజీ, అలాగే అందుబాటులో ఉండే ప్యామిలీ డాక్టర్ సిస్టమ్ చాలా వరకు ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. గ్లూకోజ్ లెవెల్స్ నిరంతరం పర్యవేక్షించుకోవడం, పోర్టబుల్ ఇ.సి.సి. డివైజెస్ వంటి పర్సనలైజ్డ్ హెల్త్ మానిటరింగ్ పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవసరమైన వారు దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తూ రోజూ వారి నడకను, వ్యాయామాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఐతే ఇటువంటి వాటి వాడకం విషయంలో ఎవరికి వారు విజ్ఞతతో సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మంచి పౌష్టికాహారం, మోతాదు మించని ఆహారపు అలవాట్లు, రెగ్యులర్ వ్యాయామం, చెడు అలవాట్లు లేకపోవడం, స్ట్రెస్‌ని తగ్గించే ఫలవంతమైన జీవన విధానం, మెరుగైన మానవ సంబంధాలు ప్రతీ ఒక్కరికీ అవసరం. ఇవి ఏమాత్రం తేలికగా తీసుకోవలసిన అంశాలు కాదు. వీటిని సాధించడానికి ప్రతి మనిషీ కృషి చేయవలసిందే. తమ వల్ల కానప్పుడు ఎక్ట్‌పర్ట్‌ల ఒపీనియన్ తీసుకోవాల్సిందే. తప్పుడు సమాచారాన్ని, సూడో సైన్సు ని ఎదుర్కోవడంలో AI ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఆరోగ్య సంబంధ సమాచారం కోసం యూట్యూబ్ లు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగించే బదులు ఛాట్ జి.పి.టి. మెటా వంటి AI టెక్నాలజీని ప్రజలు ఉపయోగించడం మొదలు పెట్టాలి. యూట్యూబ్‌లో ఎవరిష్టమున్నట్లు వాళ్ళు చెప్పే అంశాలనన్నింటినీ ఛాట్ జి.పి.టి. వంటి వాటి సహాయంతో అది సరైన ఇన్‌ఫర్మేషనేనా అని బేరీజు చేసుకోవచ్చు. సైన్స్ & టెక్నాలజీ మనకు నిజమైన సైన్స్ పరిజ్ఞానాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.
– విరించి విరివింటి, 9948616191