పీఎస్‌ఎల్‌వీసీ-56 సక్సెస్

 PSLVC-56 success

– ఇది పూర్తి వాణిజ్య ప్రయోగం
– కక్ష్యలోకి చేరిన 7 సింగపూర్‌ ఉపగ్రహాలు
సూళ్లూరుపేట : తిరుపతి జిల్లాలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఇస్రో ఆదివారం మరో వాణిజ్యపరమైన రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సరిగ్గా ఉదయం 6.31 గంటలకు మొదటి ప్రయోగ వేదికపై నుంచి పీఎస్‌ఎల్‌వీసీ-56 (పోలార్‌ సాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) రాకెట్‌ ద్వారా సింగపూర్‌కు చెందిన డిఎస్‌-సార్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు నానో ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల లోఎర్త్‌ కక్ష్యలో నిలిపింది. ఈ ఏడు ఉపగ్రహాల బరువు 442.5 టన్నులు మాత్రమే. తక్కువ బరువుగల ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న కారణంగా కోర్‌ అలాన్‌ తరహాలో స్ట్రాపాన్లు లేకుండా ఈ రాకెట్‌ను శాస్త్రవేత్తలు నిర్మించి ప్రయోగించారు. కోర్‌ అలాన్‌ తరహాలో ఇది 17వ ప్రయోగం. సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలలో డిఎస్‌ ఎస్‌ఆర్‌ ముఖ్యమైనది. సింగపూర్‌లోని ఎస్‌టి ఇంజనీరింగ్‌ వారు దీన్ని రూపొందించారు. అక్కడి స్పేస్‌ ఏజెన్సీతో కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహం రాత్రి పగలూ స్పష్టమైన చిత్రాలు తీసి శాస్త్రవేత్తలకు పంపించే సామర్థ్యం కలిగి ఉంది. ఒక మీటరు రిజల్యూషన్‌తో ఫొటోలు తీయగలదు. దీన్ని రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌గా అక్కడ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీసీ-56 ద్వారా ప్రయోగించిన వాటిలో నాన్‌ యంగ్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ (ఎన్‌టియు)కు చెందిన ఆర్కేడ్‌, వెలాక్స్‌ ఎఎం, స్కూబ్‌-2, ఎలైనా ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఒఆర్‌బి-12, స్ట్రైడర్‌, ఎన్‌యుఎస్‌కు చెందిన గెలాసియా-2, సింగపూర్‌లోని న్యూస్పేస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన నులియన్‌ ఉపగ్రహాలు ఉన్నాయి. పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. ఇప్పటివరకు 57 పిఎస్‌ఎల్‌వి రాకెట్ల ప్రయోగం జరిగింది. ఇస్రో ఇప్పటి వరకూ 92 రాకెట్లను షార్‌ నుండి ప్రయోగించింది. 34 దేశాలకు చెందిన 424 ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి సత్తా చాటింది. తాజా ప్రయోగంతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 431కు చేరుకుంది. పిఎస్‌ఎల్‌విసి-56 ద్వారా ప్రయోగించిన ఏడు ఉపగ్రహాల బరువు 422 కిలోలు. అందులో ప్రధానమైన డిఎస్‌ సార్‌ ఉపగ్రహం బరువు 352 కిలోలు. పిఎస్‌ఎల్‌విసి-56 ప్రయోగం జరిగిన తరువాత 19.30 నిమిషాలకు మొదటి ఉపగ్రహం డిఎస్‌ సార్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో విజయవంతంగా నిలిపారు. అనంతరం ఆరు నానో ఉపగ్రహాలను కక్ష్యలో నిలపడంతో ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించారు.
అంతరిక్ష పరిశోధనలో మరో చరిత్రకు ఇస్రో ముందడుగు
అంతరిక్ష వ్యర్థాల నిర్మూలనకే ఈ పరిశోధన
అంతరిక్ష పరిశోధనలో ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్రయోగాలు చేపడుతున్న ఇస్రో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పీఎస్‌ఎల్‌వీసీ-56 రాకెట్‌లో డి ఆర్జిటింగ్‌ ఎక్స్పరిమెంట్‌ చేశారు. ఈ రాకెట్‌ నాలుగో దశ ఉపగ్రహాలను విడిచిపెట్టిన తర్వాత మరింత కిందికి దిగేలా ప్రయోగించారు.