సమరానికి సై

సమరానికి సైనేడు హైదరాబాద్‌తో బెంగళూర్‌ ఢీ
బెంగళూర్‌ : చిన్నస్వామి స్టేడియం ఊరించే సమరానికి సిద్ధమైంది. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో పేలవ ప్రదర్శనతో డీలా పడిన ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నేడు తలపడనుంది.చిన్న బౌండరీల చిన్నస్వామి స్టేడియంలో నేడు సన్‌రైజర్స్‌ బ్యాటర్లు వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌బౌలర్లుగా పోరు జరుగనుంది. వరుస విజయాల జోరుకొనసాగించా లని ఆరెంజ్‌ ఆర్మీ ఎదురు చూస్తుండగా.. వరుస ఓటముల నుంచి ఉపశమనం పొందేందుకు ఆర్సీబీ ప్రయత్నించనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. బ్యాటింగ్‌,బౌలింగ్‌ విభాగాల్లో ఎవరిపైనా ఒత్తిడికనిపించటం లేదు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఆరెంజ్‌ ఆర్మీని సరికొత్తగా నడిపిస్తున్నాడు. బ్యాట్‌తో, బంతితో సన్‌రైజర్స్‌ ప్రమాద కరంగా కనిపిస్తుంది. అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్‌క్రామ్‌ లకు ఇప్పుడు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి జతకలిశాడు. పాట్‌ కమిన్స్‌, భువనేశ్వర్‌ కుమార్‌,నటరాజన్‌లు గొప్పగా రాణిస్తున్నారు. నేడు చిన్న స్వామిలో హైదరాబాద్‌ను ఎదుర్కొవటం బెంగళూర్‌కు శక్తికి మించిన పనే అవుతుంది!. మరోవైపు ఆర్సీబీ శిబిరంలో కల్లోలం కొనసాగు తుంది. విరాట్‌ కోహ్లి మినహా ఎవరూ రాణించటం లేదు. ప్రధానంగా విదేశీ క్రికెటర్ల వైఫల్యం బెంగళూర్‌ను మరింత కుంగదీస్తోంది. ఆరు మ్యాచుల్లో ఐదు ఓటములు చవిచూసిన ఆర్సీబీ నేడు ఆరో పరాజయం నుంచి తప్పించు కోవటం కష్టమే.