మనోమథనం

ఒక విషయాన్ని తన కోణం నుండే చూడడం
అర్థం చేసుకోవడం
ఆలోచించడం
నిర్ణయం తీసుకోవడం
అన్నీ వ్యక్తి తనవైపు నుండే చేసేస్తూ భుజాలెగరేస్తుంటాడు
తాను అనుకునే న్యాయాన్ని
త్రాసులో తూకం వేసి
తనను తానే న్యాయదేవత వారసుడనుకుంటాడు

ఒక్కోసారి తన కళ్లే అయినా
మోసం చేస్తుంటాయి
కొన్నిసార్లు తన చెవులే తికమిక పడుతుంటాయి
అప్పుడప్పుడు మనసు తనదే కానీ
కలగాపులగమై ఉల్టాపల్టా అయితుంటది
చాలదన్నట్లు
చెప్పుడు మాటలు తోడు కూడా అవుతుంటాయి
చిటపటలు ప్రాణమూ పోసుకుంటాయి
అవి ఒక్కసారి పుట్టాయంటే
నష్టాలకు ఎర్రతివాచి పరిచినట్టే

ఎదుటి వ్యక్తి కోణం
సన్నివేశం, పరిస్థితి
వేటితోనూ ప్రమేయం లేనప్పుడు
సత్యం అసత్యమవుతుంది
అసత్యం సత్యమూ అవుతుంది
ఒక్కసారి తన అంతర్‌ నేత్రం నుండి
మనోమథనం చేస్తే
ఉల్లిపొరల్లా మనసు తెరలు విడిపోయి
అసలేమిటో తేటపడుతుంది
– ఉప్పల పద్మ, 9959126682