ఎన్నికల్లో రిగ్గింగ్‌కు నిరసనగా ప్రతిపక్షంలో కూర్చోవాలని పీటీిఐ నిర్ణయం

ఇస్లామాబాద్‌: ఇటీవల జరిగిన పాకిస్తాన్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినా పార్లమెంట్‌లో ప్రతిపక్షంలో కూర్చోవాలని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పిటిఐ) నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్‌కు నిరసనగా పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నాయకులు అలీ సయీఫ్‌ రాత్రి ప్రకటించారు. ”ఒక వేళ ఓట్లు, సీట్లను తారుమారు చేయకుంటే మా పార్టీకి కనీసం 180 స్థానాలొచ్చి ఉండేవి. మమ్మల్ని మోసం చేశారు. అందుకే ప్రతిపక్షంలో కూర్చో వాలని నిర్ణయించాం” అని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నా యని ఆరోపిస్తూ పిటిఐ దేశవ్యాప్త నిరసనలు కూడా ప్రారంభించింది.
పంజాబ్‌ ముఖ్యమంత్రిగా నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె ?
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచడానికి చేతులు కలిపిన పిఎంఎల్‌-ఎన్‌, పిపి మధ్య శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ రెండు పార్టీలు కలిసి నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు షెహబాజ్‌ కోసం ప్రధానమంత్రి పదవిని రికార్డు స్థాయిలో నాలుగోసారి త్యాగం చేసినందుకు నవాజ్‌ షరీఫ్‌కు పాకిస్తాన్‌ సైన్యం రెండు ఆఫర్లు ఇచ్చింది. మంత్రివర్గంలో ముఖ్యమైన పదవిని తీసుకోవాలని లేదా నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మర్యాం నవాజ్‌కు పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని ఆఫర్‌ ఇచ్చింది. ఇదే జరిగితే పాకిస్తాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మర్యాం నవాజ్‌ రికార్డు సృష్టిస్తారు.