
నవతెలంగాణ – కంటేశ్వర్
అర్హులైన పేదలకు దరఖాస్తుదారులకు ప్రజాపాలన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎం నిజాంబాద్ ఏరియా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కి నిజామాబాద్ అర్బన్ ప్రజా సమస్యల మీద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏరియా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. ప్రధానంగా కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ నగరంలో వేలాది కుటుంబాలు నివాస స్థలాలు, ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో అనేక ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంటూ జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని అన్నారు. గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన టువంటి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దరఖాస్తుదారులను ఎంపిక చేసినప్పటికీ ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని దానికి తగిన బుద్ధి గత ప్రభుత్వానికి ప్రజలే చెప్పారని అన్నారు. అయితే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం కారణంగా ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అవుతున్నదని మరియు వేల సంఖ్యలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మించబడి మధ్యలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నదని అన్నారు. నూతన ప్రభుత్వం ఆరోగ్యారెంటీలు ప్రజా పాలనలో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు స్థలం ఉన్నవారికి నిర్మాణా నిమిత్తం ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేయాలని గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్ లను తక్షణమే ఎంపిక చేసినటువంటి ప్రజలకు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. మరియు సిపిఎం నిజామాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నాగారంలో 15 సంవత్సరాల క్రితం దొడ్డి కొమరయ్య నగర్, అసద్ బాబా నగర్, ఆరు సంవత్సరాల క్రితం బహుజన కాలనీ, గత సంవత్సరం దుబ్బ ప్రాంతంలోని నూతన కలెక్టరేట్ వద్ద భూ పోరాటాలు నిర్వహించి ప్రజలకు నివాసాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి భూముల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పట్టాలు అందకపోవడం కారణంగా కొంతమంది భూకబ్జాదారులు ఈ భూ కేంద్రాల్లోకి చొరబడి గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల అండతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అక్కడ భూములను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అలాంటి వారిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం నిర్వహించిన భూ పోరాట కేంద్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కటారి రాములు, బి సుజాత, పి మహేష్, నగర కమిటీ సభ్యులు ఎన్ నరసయ్య లు పాల్గొన్నారు.