ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాధనం

Public funds for government programs– పీఎం, సీఎం ఈవెంట్స్‌ కోసం 35 వేల బస్సులు
– మూడేండ్లలో ఎంగేజ్‌ చేసిన గుజరాత్‌ సర్కారు
– ఇప్పటి వరకు రూ. 22 కోట్ల బకాయిలు
– రవాణా బస్సులను ఉపయోగించటాన్ని తప్పుబట్టిన సామాజిక కార్యకర్తలు
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నది. పీఎం, సీఎంలు పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవడానికి రవాణా బస్సులను పెద్ద ఎత్తున వినియోగించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రధాని మోడీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమాలకు ప్రజలను తీసుకెళ్లడానికి రాష్ట్ర సర్కారు ప్రజా రవాణా బస్సుల కోసం రూ .22 కోట్ల కంటే ఎక్కువ బకాయి పడి ఉన్నది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల కోసం ఉద్దేశించిన బస్సులను వినియోగించటంపై సామాజిక కార్యకర్తలు, విపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగేష్‌ మెవాని లేవనెత్తిన ప్రశ్నకు ప్రతిస్పందనగా ఈ సమాచారం వెల్లడైంది.
మోడీ లేదా గుజరాత్‌ ముఖ్యమంత్రి హాజరైన ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలను తీసుకురావడానికి 2020-21లో 122 బస్సులు మాత్రమే ఉపయోగించారు. ఇది 2022-23లో 31,211 కు చేరుకోవటం గమనార్హం. 2020-21లో కోవిడ్‌ -19 లాక్‌డౌన్లు, సమావేశాలపై పరిమితుల కారణంగా తక్కువ సంఘటనలు జరిగాయి. విజరు రూపానీ, భుపెంద్ర పటేల్‌ ఆ మూడేండ్ల కాలంలో గుజరాత్‌కు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. గుజరాత్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (జీఎస్‌ఆర్‌టీసీ) గత మూడేండ్లలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమాలకు మొత్తం 34,868 బస్సులు కేటాయించారని వెల్లడించింది.
2020-21 మధ్య బస్సులకు ప్రభుత్వం రూ .14.27 లక్షలు, 2021-22 రూ .8.21 కోట్లు చెల్లించింది. కానీ రూ .74.43 లక్షలు చెల్లించలేదు. 2022-23లో బస్సులను ఉపయోగించినందుకు ప్రభుత్వం రూ .86 కోట్లు చెల్లించింది. అయితే రూ .11.41 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో మొత్తంగా, పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ .22.16 కోట్లకు చేరుకున్నది.మరో గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాంతి ఖరాడి మరొక ప్రశ్నను లేవనెత్తారు. పీఎం, సీఎం పాల్గొన్న సమావేశాలే కాకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకెళ్లడానికి మూడేండ్లలో ఎన్ని బస్సులు అద్దెకు తీసుకున్నారని ప్రశ్నను లేవనెత్తగా.. ప్రభుత్వం సమాధానాన్ని వెల్లడించింది.
2020-21లో ప్రభుత్వ కార్యక్రమాలకు 21,964 రాష్ట్ర రవాణా బస్సులు, 2021-22లో 6,898, 2022-23లో 38,868 బస్సులను నియమించిందని తేలింది. ఆ మూడేండ్ల కాలంలో నియమించిన బస్సుల కోసం గుజరాత్‌ ప్రభుత్వం జీఎస్‌ఆర్‌టీసీకి రూ .112 కోట్లు చెల్లించింది. రూ .41.01 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
దీనిపై ఖరాడి మాట్లాడుతూ.. ప్రభుత్వం ”అద్దె చెల్లించకుండా రాజకీయ కార్యక్రమాలపై ప్రజల డబ్బును వృథా చేసింది. ఇది ప్రజలను మోసిగించటమే” అని అన్నారు. ”రాష్ట్ర రవాణా బస్సులు గ్రామీణ ప్రజలను రవాణా చేయడానికి ఉద్దేశించినవి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం జనాన్ని సేకరించకూడదు. ప్రభుత్వం బస్సులను పెద్ద ఎత్తున నియమించినప్పుడు గ్రామీణ రవాణా దెబ్బతింటుంది” అని ఆయన అన్నారు.