– బీఆర్‌ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా తయారైందని మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో వైద్యరంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మాతా శిశు మరణాలు పెరిగాయనీ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని తెలిపారు. వాటిపై అధ్యయనం కోసం బీఆర్‌ఎస్ తరపున ముగ్గురు సభ్యులతో ఒక అధ్యయన కమిటీని వేశారని వివరించారు. ఈ కమిటీ గాంధీ ఆస్పత్రికి వెళితే పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. అక్కడికి తాము వెళితే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.