– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
– నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు అందజేత
నవతెలంగాణ-మియాపూర్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వైద్యశాఖలో నియామకాలు జరుగుతున్నాయని, ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ శిల్పాకళ వేదికలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేశామని తెలిపారు. డాక్టర్లు, నర్సలను పెద్ద ఎత్తున నియమకాలు చేపడుతున్నామని తెలిపారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఒకేరోజూ నియామక పత్రాలను అందచేయడం వైద్య చరిత్రలోనే ఓ రికార్డు అని తెలిపారు. 5 నెలల్లోనే ఇంత పారదర్శకంగా నియమాకాలు జరిగాయని తెలిపారు. గత నెలలో వైద్య, ఆరోగ్యశాఖలో 9,056 ఉద్యోగాలు ఇచ్చామని, అలాగే 1,331 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేశామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో మొత్తంగా 22,263 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని, మరో 9,282 మందికి కొత్తగా ఉద్యోగాలు రాబోతున్నాయని, స్టాఫ్‌నర్స్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది రోగులకు వైద్యం అందించేప్పుడు వారిలో మీ తల్లితండ్రులను చూడాలని, బాధ్యతగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలని సూచించారు. ప్రభుత్వంలో వర్క్‌లోడ్ ఉంటుందని, ఓపికగా ఉండాలని, ప్రజలకు మేలు చేసే విధంగా డాక్టర్లు పని చేయాలని అన్నారు. భవిష్యత్‌లో ఏ ఇతర దేశాల్లో లేని విధంగా మెడికల్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది వైద్య వృత్తి అన్నారు. సమాజంలో డాక్టర్లలది అమోఘమైన పాత్ర అన్నారు. జవాన్‌లకు ఉండే గౌరవం డాక్టర్‌కు ఉంటుందని, ఆపదలో ఉన్నవారికి మరో జన్మ ఇచ్చేది డాక్టర్లలని కొనియాడారు. పైసలు సంపాదించే మార్గాలు చాలా ఉంటాయి కానీ డాక్టర్ అంటే గౌరవం గొప్పదని, కుటుంబంలో డాక్టర్ ఉంటే గ్రామానికి గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొన్నారు.