– ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ తిలోదకాలు : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజరు రాఘవన్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యలే ఏజెండాగా సీపీఐ(ఎం) ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందని అ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజరు రాఘవన్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నిర్వహించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా తమ పార్టీ ముందుకెళ్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ బీజేపీ రాజ్యాంగేతర శక్తిగా మారిందన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవన్ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని ఓడించే ప్రజాస్వామ్య శక్రులకు మద్దతు ఇస్తూనే తాము బలంగా ఉన్న 19 స్థానాల్లో పోటీలో ఉన్నామన్నారు. సీపీఐకి ఒక్క సీటులో మద్దతు ఉందన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలను విడనాడి బీజేపీ రాజ్యాంగేతర శక్తిగా మారిందన్నారు. బీజేపీ పాలనలో దళితులు, కార్మికులు, కర్షకులపై భారాలు అధికమయ్యాయని, ప్రతి ఒక వర్గం సంకటస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ మాట్లాడుతూ.. ప్రత్యా మ్నాయ విధానం కావాలని ప్రజలు కోరుకుంటు న్నారన్నారు. కమ్యూనిస్టులు పోటీ చేస్తున్న 20 స్థానాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు అఖిలభారత స్థాయిలో ప్రభావితం చేస్తాయని అన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుందే తప్ప బీసీల సమస్యలపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు. ఖమ్మంలో కమ్యూనిస్టులను ఆదరించాల్సిందిగా కోరారు. సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎం. సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేశ్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.