‘ప్రజా అవసరాలే ప్రధాన అజెండా కావాలి’

రాబోయే 2024 సార్వత్రిక, లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజల జీవితాలను మెరుగు పరిచే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి అజెండాలను రూపుదిద్దుకుని, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలి. ప్రజలు తమ కాళ్ళపై తాము స్వతంత్రంగా బతికే పరిస్థితి నెలకొనే విధంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్‌ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం. రాజకీయ పార్టీల భవితవ్యం నిర్ణయిస్తారనే విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ‘నిరుద్యోగం రూపుమాపుతాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం’ అనే భావన యువతలో కలిగించాలి. అలాగే 2004 సెప్టెంబర్‌ నుంచి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ”నూతన పెన్షన్‌ విధానం” రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం పునఃప్రారంభం చేయుట ద్వారానే ఉద్యోగులు ఆయా పార్టీలకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనపడుతోంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక ఎన్నికలు ఈ విషయాన్ని రుజువు కూడా చేశాయి.
ఇక సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా వడ్డించడం తాత్కాలికంగా ఉపశమనే అవుతుంది. అవి కూడా ప్రజలకు ఎంతోకొంత ఉపయోగమే కానీ నిత్యావసర వస్తువులు ధరలు నియంత్రణ చేసే భరోసా కల్పించాలి. ముఖ్యంగా అందరికీ ఉచితంగా విద్యా, వైద్యం అందించేందుకు పార్టీలు సమాయత్తం కావాలి. అప్పుడు మాత్రమే ప్రజలు అండగా ఉండే అవకాశం ఉంది. ఈ దశాబ్ద కాలంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాలు దుర్భరమవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌ కాలంలో ప్రజలు పడిన యాతన ముఖ్యంగా లాక్‌డౌన్‌ కాలంలో మొదలైన ఇబ్బందులు నేటికీ వెంటాడుతున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ భాషా చిచ్చులు పెట్టే సంస్కృతికి అన్ని రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలి. లౌకిక ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేయాలి. ప్రధానంగా భారతదేశంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావనకు కట్టుబడి ఉంటేనే ఆయా పార్టీల వైపు ప్రజలు చూస్తారు అనే విషయం మరువరాదు. ఏ రాజకీయ పార్టీకైనా ఆయా ప్రాధాన్యతను బట్టి కొంత సాలిడ్‌ ఓటు బ్యాంకు ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో వివిధ శాసన సభల ఎన్నికల్లో, (లేదా) లోక్‌ సభ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎక్కువగా స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తెరగాలి. ఈ నిర్ణయించే ఓటర్ల సంఖ్య మాత్రం మైనారిటీ వర్గాల ప్రజలు, మేధావులు, యువత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులే.
అందుచేతనే, రాబోయే ఎన్నికల్లో ప్రతీ రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తయారు చేసుకోవాలి. కేవలం విద్వేష ప్రసంగాలు, తాత్కాలిక ఉద్రేకాల ద్వారా రాజకీయ లబ్దిపొందు తామంటే ఇక విజ్ఞాన సమాజంలో ఎంతమాత్రం చెల్లదు. భారతదేశాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించాలంటే ముఖ్యంగా భారత రాజ్యాంగం ఆశయాలకు అనుగుణంగా పార్టీల పనితీరు, మ్యానిఫెస్టో ఉండాలి. ప్రభుత్వ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ మానుకోవాలి. కేవలం దేశ సంపద కొంతమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం చూస్తుంటే ఏలికలు వారికోసమే పనిచేస్తు న్నట్టుగా అర్థమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలి. వారిచ్చే సూచనలు సలహాలు పాటించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వారు, అధికారం ఉందికదా! అని నియంతల వలే పాలన చేస్తే, భవిష్యత్తులో భంగపాటు తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవాలు. ప్రస్తుత కాలంలో మనదేశంలో పాలకులు చరిత్రను తిరగరాసే పనిలో పడ్డారు. సంస్కృతి మీద, ప్రజల బతుకుల మీద దాడులు చేస్తున్నారు. లౌకికవాదానికి భిన్నంగా ముందుకు సాగుతున్నారు. ఇలా ఒంటెద్దు పోకడ పోతే, భవిష్యత్తులో వీరి చరిత్ర ప్రశ్నార్థకమే అవుతుంది.
చరిత్ర ద్వారా గత తప్పులు గ్రహించి, భవిష్యత్తు తీర్చి దిద్దుకోవాలి. ముఖ్యంగా మనదేశంలో ప్రజలు, ఓటర్లు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి. చాలామంది పాలకులను, పార్టీలను తమ ఓటు ద్వారా భవిష్యత్తు లేకుండా చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ప్రతీ రాజకీయ పార్టీ తమ విజయానికి అనుగుణంగా, ప్రజల భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అందరికి భరోసా కల్పించాలి. అప్పుడు మాత్రమే ఆయా పార్టీల ద్వారా ప్రజలకు మంచి పాలన అందుతుంది.
– రావుశ్రీ