– ఈసీకి లేఖ రాసిన 2200 మందికి పైగా పౌరులు
– ప్రధానిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చేలా ప్రధాని మోడీ ప్రసంగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఉల్లంఘించినందుకు మోడీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2200 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ సమర్పించారు. ఆదివారం రాజస్థాన్‌లోని బన్‌స్వారాలో మోడీ ప్రసంగించారు. అక్కడ కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ఆరోపణలు చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల సంపదను ‘చొరబాటుదారులు’, ఎక్కువ సంతానం కలిగిన వారికి పంచాలంటున్నదని ఆరోపించారు. ”ఇప్పటికే ఉన్న విభేదాలను తీవ్రతరం చేసే, పరస్పర ద్వేషాన్ని సృష్టించే, మతపరమైన, భాషాపరమైన వివిధ కులాలు, వర్గాల మధ్య ఉద్రిక్తతలను కలిగించేలా ఎలాంటి కార్యక్రమంలోనైనా పార్టీ, అభ్యర్థి ఏ పాల్గొనకూడదని ఎంసీసీ స్పష్టంగా చెప్తున్నది. మోడీ రాజస్థాన్‌లో చేసిన ప్రసంగం.. భారత రాజ్యాంగాన్ని గౌరవించే లక్షలాది మంది ప్రజల మనోభావాలకు భంగం కలిగించింది” అని పౌర బృందం లేఖలో పేర్కొన్నది. ప్రసంగం ప్రమాదకరమైనదనీ, భారత్‌లోని ముస్లింలపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. ”ప్రధాని నిర్మొహమాటంగా కోడ్ ఉల్లంఘించారు. కేవలం ‘మత భావాలను’ ఆకర్షించడమే కాకుండా ఒక వర్గంపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టటం, తీవ్రతరం చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచంలో ‘ప్రజాస్వామ్య మాతృమూర్తి’గా భారత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది” అని లేఖ వివరించింది. ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకోకపోవటం దాని విశ్వసనీయత, స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పౌర బృందం ఆందోళనను వ్యక్తం చేసింది.
రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ… ”కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉన్నదని చెప్పారు. అంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి, చొరబాటుదారులకు సంపదను పంచుతారు. ఇది మీకు ఆమోదయోగ్యమైనదేనా?” అని అక్కడి ప్రజలను అడిగారు. ఇప్పుడిది రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతున్నది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టాన్ని తెస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.