– అర్జెంటీనాలో వెల్లువెత్తిన నిరసన
బ్యూనస్ ఎయిర్స్ : ప్రజా వ్యయాన్ని తగ్గిస్తాన్న వాగ్దానంపై అధికారం చేపట్టిన పచ్చి మితవాది జేవియర్ మిలైకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. మిలై ఆర్థిక చర్యలను వ్యతిరేకిస్తూ బుధవారం వేలాది మంది అర్జెంటీనియన్లు రాజధాని బ్యూనస్ ఎయిర్ వీధుల్లో నిరసన చేపట్టారు. పేదలకు ఆర్థిక మద్దతు కల్పించాని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పలు వీధుల నుంచు అధ్యక్ష భవనం ఎదుట ఉన్న చారిత్రాత్మక మీటింగ్ పాయింట్ ప్లాజా డి మయో స్క్వేర్ ర్యాలీగా చేరుకున్నారు. మిలై ప్రమాణస్వీకారం చేసిన అదే ప్రాంతంలో నిరసన చేపట్టారు. మిలై నియంతలా వ్యవహరిస్తున్నారని నినాదాలిచ్చారు. భారీగా పోలీసులు ర్యాలీ వెంట నడిచారు. ఇది శాంతియుత ర్యాలీ అని, ఆందోళనలు, ఘర్షణలు కోరుకోవడం లేదని వామపక్ష ఆందోళన బృందం అధ్యక్షుడు ఎడ్వార్డో బెల్లిబోనీ తెలిపారు. అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా జేవియర్ మిలై డిసెంబర్ 10 బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి మరియు ఇటీవల నిరసనలను అణిచివేసేందుకు విస్తృత ప్రణాళికలను రచించినట్టు ప్రకటించారు. మిలై ‘షాక్ థెరపీ’ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతవారం అర్జెంటీనా కరెన్సీ విలువను 54 శాతం తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే సబ్సిడీలను, ప్రభుత్వ సేవలను రద్దు చేశారు. అర్జెంటీనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ చర్యలు చేపట్టాల్సిందేనని మిలై సన్నిహిత మంత్రులు పేర్కొన్నారు. మిలై భద్రతా మంత్రి గతవారం నిరసనలను వ్యతిరేకిస్తూ ప్రోటోకాల్‌ను సమర్పించారు. రహదారులను బ్లాక్ చేయకుండా, ప్రదర్శనకారులను నిరోధించడానికి భద్రతా బలగాలను ప్రయోగించవచ్చని పేర్కొంది.
ఈ చర్యలను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. నిరసన తెలిపే హక్కుని అడ్టుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.