వన మహోత్సవ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని, శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఆయన వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్య శాఖలతో మొక్కలు నాటే కార్యక్రమాలను సమీక్షించారు. జిల్లాకు నిర్దేశించిన 17 లక్షల 44 వేల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి గుంతలు తీసే కార్యక్రమం వెంటనే పూర్తి చేసి మొక్కలు నాటడం ప్రారంభించాలని, నాటిన మొక్కల సంరక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీల వారిగా యాక్షన్ ప్లానుతో ప్రతి మొక్క బ్రతికేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, శిఖం భూములలో మొక్కలు నాటి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల యజమానుల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని, పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగించి మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, అలాగే మున్సిపల్, గ్రామాలలోని నర్సరీలలో మొక్కల సంరక్షణ ముఖ్యమని, ప్రజాప్రతినిధులను వన మహోత్సవ కార్యక్రమాలలో భాగస్వాములను చేసి లక్ష్యాలను సాధించాలని, పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి సునంద, జిల్లా ఎక్సెజ్ అధికారి సైదులు, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా ఉద్యానవన అధికారి అన్నపూర్ణ, భువనగిరి మున్సిపల్ కమీషనర్ రామాంజలురెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి నర్సింహ్మ, ఇఇ పంచాయితీరాజ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.