ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలి

– ప్రయివేట్‌ బడిలో ఉన్నదేంది – సర్కారు బడిలో లేనిదేంది
– రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-పాలకీడు
ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని, విద్యార్థుల శాతం పెరగకుంటే సర్కారీ బడులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని బొత్తలపాలెం గ్రామంలో గురువారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సర్కారీ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి, ప్రయివేట్‌ పాఠశాలల్లో పెరగడానికి గల కారణాలను, క్షేత్రస్థాయిలో వారి నుండి తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయుల నుండి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 120 కి తగ్గకుండా విద్యార్థులు ఉంటే, ఐదుగురు టీచర్లను నియమించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒప్పిస్తామని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థుల శాతం తక్కువగా ఉంటే జరిగే నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సమాజంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందాలన్నది తమ వేదిక లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయం చేసుకొని, ఆర్థికంగా చితికి పోతూ ప్రయివేటు బడులకు పంపిస్తున్న, కుటుంబాలను కలిసి సర్కారీ బడులకు విద్యార్థులు వచ్చేలా క్షేత్రస్థాయిలో కషి చేయాలని సూచించారు. 22 లక్షల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద గ్రామంలో ప్రాథమిక పాఠశాల్లో అన్ని సౌకర్యాలను కలిగి ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేసి తల్లిదండ్రులకు తరగతి గదులు తదితర వసతులను చూయించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్న సర్కారీ బడుల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత, ప్రభుత్వ ఆజమాయిషి లోపించడం తదితర కారణాలతో, ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం సన్నగిల్లుతుందని, 23 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అటెండర్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని మండల ఎంపీపీ భూక్య గోపాల్‌ నాయక్‌ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సర్పంచ్‌ భోగాల వీరారెడ్డి, ఎంపీటీసీలు పిన్నెల్లి ఉపేందర్‌, దొంగల వెంకటయ్య, మీసాల ఉపేందర్‌, ఉప సర్పంచ్‌ అందె వెంకటయ్య, గ్రామ పాలకవర్గం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అనంత ప్రకాష్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి, కొంతవరకైనా ఒప్పించి విద్యార్థుల శాతాన్ని పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, కార్యదర్శి గుండా బిక్షపతి, ఎంఈఓ శత్రు నాయక్‌, హుజూర్‌నగర్‌ డివిజన్‌ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, పిఎసిఎస్‌ వైస్‌ చైర్మెన్‌ పగడాల మట్టేష్‌, సుంకరి క్రాంతి, ప్రధానోపాధ్యాయులు భరణి కుమార్‌, రెడ్డిపల్లి శ్రీనివాస్‌, వడ్డే సైదయ్య, అందే రాజు, వెంకటేశ్వర్లు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.