”పల్లెటూరి పిల్లగాడ/ పసులగాచే మొనగాడ”
అని ‘మాభూమి’ లో పాట రాసిన కవిగానే ఈనాటి తరానికి సుద్దాల హనుమంతు గురించి తెలుసు. ఆయన గేయ రచయిత మాత్రమే కాదు, నిరుపేదల పక్షం వహించిన ఆంధ్ర మహాసభ కార్యక్రమాల నుంచి, కమ్యూనిస్టుల ఉద్యమాల నుంచి సహజాతిసహజంగా పుట్టుకొచ్చిన వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడే కాదు, కళాకారుడు, ప్రజల పక్షాన వ్యవస్థతో పోరాటాలు చేసిన ప్రజా యోధుడు కూడా.
వీరోచితమైన హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమ ఇతిహాసంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు జీవితం- సాహిత్యం ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామంలోని పేద పద్మశాలి కుటుంబంలో పుట్టిన హనుమంతు వీధి బడిలోనే ప్రాథమిక విద్యను పొందాడు. ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. హనుమంతు తాతగారు కృష్ణా వారి కళాకారుడు, హరికథకుడు. తండ్రి బుచ్చి రాములు ఆయుర్వేద వైద్యుడు, కళాకారుడు. తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి ముప్ఫైఏళ్లపాటు వీధి నాటకాలు ప్రదర్శించిన కళాజీవి. 70 గ్రామాలు తిరిగి ప్రజలకు వైద్యం చేసిన ప్రజా వైద్యుడు.
హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు, ప్రదర్శన కళల్లో రాటుదేలిన తాత తండ్రుల వారసత్వం, చక్కగా గొంతెత్తి పాడగల శ్రావ్యమైన కంఠస్వరం తనకు వరంగా లభించిన హనుమంతు, అంజయ్య గారి డ్రామా కంపెనీలో సభ్యుడిగా చేరాడు. అప్పటికే ధ్వన్యనుకరణలోనూ, గాన మాధుర్యంలోనూ మునిగి తేలుతున్న హనుమంతు నటనలో తర్ఫీదు పొందాడు. ఆడ, మగ పాత్రలు ఎన్నో ధరించాడు. నటుడిగా పదునెక్కాడు. గాన కోకిలగా గౌరవింపబడ్డాడు.
రావి నారాయణరెడ్డి గారి ఉపన్యాసాలతో ఉత్తేజితుడై ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, కవిగా, కళాకారుడిగా తెలంగాణ విమోచన ఉద్యమ సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించాడు.
సుద్దాల హనుమంతు కాలంనాటి తెలంగాణ గ్రామాల్లోని ఆర్థిక, సామాజిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. ప్రజలంతా గ్రామంలోని నలుగురైదుగురు పెత్తందారులకు బానిసలై బతుకుతుంటారు. దారుణమైన వెట్టిచాకిరి, అంతకన్నా దారుణమైన అధికారుల జులుం. నిత్యం తన్నులు, తిట్లు. కచ్చేరీ చావిళ్ల వద్ద వంగబెట్టి మూపున బండలు, బండలే కాకుండా గ్రామ వెట్టిని రైతుల మోపున ఎక్కించి తొక్కించేవారు. పండిన పంటనంతా లెవీలని, తావానులని, నాగులని, నజరానాలని దోచుకునేవారు. బూడిద పట్టి, పెండ్లి పట్టి, సమర్త పట్టీలు సరే సరి. మధ్యయుగాలనాటి భూస్వామ్య దోపిడీని తలపింపజేసేలా ఆ అరాచకం కొనసాగేది. ఆనాటి నిజాం పాలన కాలంలో జమీందారులు, జాగీర్దార్లు, భూస్వాములు వారి తాబేదారులు చేసేటటువంటి కిరాతకాలను ఎదుర్కోవడమే ఆనాటి ఆంధ్ర మహాసభ లక్ష్యమైంది.
రచయితలు, కళాకారులు, గాయకులు గ్రామాల్లో దొరలకు శత్రువులు అయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలంటే సాయుధదళం కాపలా కాసే పరిస్థితులు వచ్చాయి. గాయకులు పాట పాడటమే కాదు, కార్యకర్త కూడా కావలసి వచ్చింది. సంఘం నిర్మించడంలో వారి బాధ్యత చెప్పరానిది. సంఘాలు, దళాలుగా మారిన దశలో కార్యకర్తలు సాయుధులు కావలసి వచ్చింది. ఎర్రబోళ్ళు ఊరిలో హనుమంతు మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. నాటి నుండి ఓ చేతిలో పాట, మరో చేతిలో ఆయుధం పట్టుకున్నాడు. సాంస్కృతికరంగంలో అనేక వేషధారణలు వేస్తూనే, పోరాట రంగంలో గెరిల్లా ఎత్తుగడలతో పాల్గొన్నాడు.
మహోపన్యాసాలు చొరబారని కోణాల్లోకి తమ పాటల్ని ఈటెలుగా, కాగడాలుగా చేసి జనంలోకి స్వయంగా తీసుకెళ్లాడు. కేవలం పాటల్ని కాకుండా సాధువు, బుడబుక్కలు, ఫకీరు వేషం (దండా గానం), పిట్టలదొర మొదలైన కళారూపాలు రాసి ప్రదర్శించాడు. ఎన్నో భూస్వామ్య వ్యతిరేక గేయాలు రాసి ప్రచారం చేశాడు. ఈ విధంగా హనుమంతు తన రాజకీయ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, రాజీ లేకుండా నిస్వార్ధ కమ్యూనిస్టుగా జీవించాడు.
ప్రత్యేకమూ, వైవిధ్య భరితమూ అయిన కళారూపం ‘గొల్ల సుద్దులు’. దిక్కూమొక్కూ లేని ప్రజలకు అత్యంత చేరువలో ఉండి అలరించి, ఆలోచింపచేస్తూ ఆచరణాత్మక క్రియాశీలక రాజకీయ అవగాహనతో నిరక్షరాస్యులు కూడా ఉద్యమంలో పనిచేసేందుకు ఊపిరి పోస్తూ వచ్చింది ఈ ప్రజా కళా విశేషం.
కథ, దర్వు, చిత్రకథ అనే ప్రక్రియలుగా ఈ గొల్ల సుద్దులు ప్రదర్శన సాగుతూ ఉంటుంది. పాట రూపంలో ఈ గొల్ల సుద్దులు కార్యక్రమం ఆసాంతం అద్భుతంగా కొనసాగుతుంది. వీటితోపాటు ప్రార్థన, కాలక్షేపం అనేవి కూడా ఉంటాయి. వీటిల్లో స్వాతంత్య్ర సమరం కోసం పడే ఆరాటాలు, సమరాన దూకిన సత్యం సాయం కోరడం వంటి అనేకాంశాల ప్రస్తావన ఉంటుంది.
వీర తెలంగాణను ఒక సాంఘిక యక్షగానం అన్నాడు గనుక, దాని రచనా విధానంలో కొన్ని కొత్త ప్రయోగాలకు అవకాశం కల్పించాడు సుద్దాల హనుమంతు. పాత్రల ప్రవేశం, దరువులు, సంభాషణలు, భాష, పాత్రల చిత్రీకరణ వంటి వాటిల్లో నూతనత్వాలకు తావిచ్చాడు. సాధారణంగా యక్షగానాల్లో ప్రారంభమప్పుడు గణపతి స్తుతి, ఇష్టదైవ ప్రార్ధన వంటివి ఉంటాయి. కానీ ఇందులో అటువంటివేమీ లేకుండా సూత్రధారి భారతమాతను ప్రార్థిస్తూ రంగ ప్రవేశం చేస్తాడు. ఇందులో భూస్వాముల నైజం, వారి దోపిడీకి గురైన బడుగు జీవుల ధైన్యం, ఆయా పాత్రల ద్వారా బలంగా చిత్రీకరింపబడ్డాయి. ఒక స్త్రీ నాయకత్వంలో ప్రజలంతా ఏకమై… దొరను, కరణాన్ని అంతం చేయడమన్నది యక్షగానం సాధించిన కళా ప్రయోజనం.
పాటలు: ఆనాటి దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ రణక్షేత్రంలో ఒక సాంస్కృతిక సేనానియై ఎగసిన సమరకేతనమే సుద్దాల హనుమంతు. ఎక్కడ ఏ రూపంలో అన్యాయం, అక్రమాలు చెలరేగినా, వాటిని గ్రహించి నిలిచిన వీరకిశోరమానాడు. సతతం ప్రజల పక్షాన నిలుస్తూ, తన సర్వస్వాన్ని పోరుబాటలో సమిధను చేశాడు.
కిరాయి మూకల దుష్కృత్యాలు నిజాం పాలనలో భాగంగా మారాయి. మతం పేరుతో కొంత, భాష పేరుతో మరికొంత అలవిమాలిన అకృత్యాలు నిత్య కృత్యాలైనాయని ఒక పాటలో వివరించారు. ”ఈ భూమి నీదిరా/ ఈ నిజాం ఎవడురా” అని ఊరురా తిరుగుతూ ప్రజా చైతన్యాన్ని రగిలించారు. ”దెబ్బకు దెబ్బ వేరు” అనే గీతానికి 70 సంవత్సరాల వృద్ధురాలు పిలిపే సుద్దాల హనుమంతుకు ప్రేరణ అయింది. సంఘం అంటే ఆనాడు నిర్మాణయుతమైన ఉద్యమానికి ఆధారం. సంఘ నిర్మాణ గీతాల ద్వారా రైతు కూలీలను, మహిళలను అధిక సంఖ్యలో కూడగడుతూ వచ్చారు. ”లేరా జాగేలా” గేయంలో సార్వజనీయమైన అభ్యర్థన ఒకటి వినిపిస్తుంది. వెట్టి చాకిరి అరికట్టాలని ఒక గీతంలో పిలుపునిస్తారు. ”అమరవీరులకు జోహార్లు” చెప్పుకోవడంతో పాటు వారి త్యాగాలు వృధా కాకూడదని వారు ఆశిస్తారు.
ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న ఆత్మవిశ్వాస ప్రకటన సామ్యవాదం కోసం అనే గేయం. ”ఇంకెన్నడు సోషలిజం” అనే గేయాన్ని రచించినప్పుడు అధికార పార్టీ ఏదో వెలగబెడుతుంది అనుకున్న కలలు అనతి కాలంలోనే కల్లలు కావడాన్ని ప్రస్తావిస్తారు. ”ఎందుకు భయం”లో ఎంతకీ ఆరిపోని ఒక మహదాకాంక్షను వెల్లడిస్తూ ఆశావహ దృక్పథాని వ్యక్తపరుస్తాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 34 సంవత్సరాలు అయినప్పుడు రాసుకున్న గేయం ”ఎన్నాళ్ళీ కష్టకాలం”. ఇంతటి సుదీర్ఘకాలం గడిచినప్పటికీ రైతుల కష్టాలన్నీ తొలగిపోయి సమస్యలన్నీ తుడిచిపెట్టుకుపోయి ఉండాలన్నది సుద్దాల హనుమంతు అభిప్రాయం.
బాలల పలు కష్టాలు, కడగండ్ల మీద ఆసాంత కరుణారసౌద్రేకమైన గేయాన్ని- కసితో కూడిన తీవ్ర వేదనతో సృజించిన అరుదైన ఏకైక మహోద్యమ కళాకారుడు కవి సుద్దాల హనుమంతు. అతని ”పల్లెటూరి పిల్లగాడా” గీతం బాల కార్మిక వ్యవస్థ మీద విసురుగా ఎక్కుపెట్టిన ఒక సార్వకాలిన అసామాన్య సాంఘిక శాస్త్రం. ”శివ గోవిందా”, ”నందామయ గురుడ నందామయ” అనే తత్వాల కోవలో బూర్జువా రాజకీయ పార్టీల అరాచకత్వాన్ని, దోపిడిని ఎండగట్టిన విధానం బాగుంది.
జీవితాంతం ఒక సాంస్కృతిక కెరటమై, అజేయ ఉద్యమ బాటై ఎగసినాడు సుద్దాల హనుమంతు. నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి ఉన్నాడు. పాటకు విరామం లేకుండా, గాయకుడిగా ఇసుమంతైనా అలసిపోకుండా ఆడుతూ పాడుతూ, అక్షర జ్ఞానం లేని అభాగ్యులు మొదలుకొని ఉద్యమకారులందరిలో చైతన్యం రగిలించిన మహానుభావుడు ఆయన.
నేటి తరానికి సుద్దాల హనుమంతు గురించి తెలియని పరిస్థితుల్లో ఎంతో శ్రమించి, ఎక్కడెక్కడో సుద్దాల హనుమంతు మీద వచ్చిన వ్యాసాలను, ఆయన రచనలను సేకరించి సమగ్ర సంకలనంగా ‘ప్రజాకవి సుద్దాల హనుమంతు సమగ్ర సాహిత్యం – జీవితం’ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. వీటితోపాటు చివరగా ”స్మృతి గీతాలు” పేరిట 11 మంది కవులు రాసిన గేయాలు ఉన్నాయి. ”మిత్రుల జ్ఞాపకాలు”లో 11 వ్యాసాలు ఉన్నాయి. ఆఖరున జయధీర్ తిరుమలరావు చేసిన ఇంటర్వ్యూను చేర్చడం బాగుంది. ప్రస్తుతం వస్తున్న యూనివర్సిటీ సిద్ధాంత గ్రంథాల కంటే మిన్నగా ఈ పుస్తకం రూపొందించడంలో సంపాదకుడు కె ఆనందాచారి తీసుకున్న శ్రద్ధ, చేసిన కృషి ప్రశంసనీయం.
(ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్తక ఆవిష్కరణ సభ)