ప్రజావాణి అద్భుతం

– త్రివిధ దళాలు, ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల బృందం
– ఆ కార్యక్రమం గురించి వివరించిన చిన్నారెడ్డి, దివ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ అద్భుతంగా ఉందని త్రివిధ దళాలు(ఆర్మీ, నావీ, ఏయిర్‌ఫోర్స్‌), ఆలిండియా సర్వీసెస్‌ అధికారుల బృందం కొనియాడింది. ప్రజా భవన్‌లో తమ సమస్యలు విన్నవించేందుకు భారీగా తరలి వస్తుండటం విశేషమని అభిప్రాయపడింది. మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌, ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌లతో బృంద సభ్యులు సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును చిన్నారెడ్డి, దివ్య వారికి వివరించారు. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రజావాణికి వస్తున్న అర్జీలను అందజేసిన వెంటనే సమస్యలను ఓపికతో విని సీఎం ప్రజావాణి పోర్టల్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులకు పంపుతామనీ, సీఎం ప్రజావాణి పేరిట రశీదు ఇస్తూ దాన్ని నిరంతరం ఫాలోఅప్‌ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అధికారి రావులపాటి మాధవి కూడా పాల్గొన్నారు.
దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్‌ యువకుడు వెతికి పెట్టాలని ‘ప్రవాసీ ప్రజావాణి’ లో విజ్ఞప్తి
దుబాయిలో తప్పిపోయిన తమ కొడుకు రాహుల్‌ రాజ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అతని తల్లిదండ్రులు తల్లిదండ్రులు కుముదిని, గౌతమ్‌ ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్‌ రాజ్‌ (32) ఉద్యోగం కోసం విజిట్‌ వీసాపై ఈ నెల 14న దుబాయికి వెళ్లాడు. ఆ తర్వాత 19న తన బ్యాగును దొంగలు కొట్టేశారనీ, అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత అతని మొబైల్‌ స్విచ్చాఫ్‌ అయింది. అప్పటి నుంచి సమాచారం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రజావాణిలో అతని తల్లిదండ్రులు మంగళవారం ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు రాహుల్‌ను వెతికి పెట్టి ఇండియాకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆచూకీ తెలిసినవారు 91 98487 49667 మొబైల్‌ నెంబర్‌కు వాట్సాప్‌ చేయాలని కోరారు. టీపీసీసీ ఎన్నారై సెల్‌ చైర్మెన్‌, అంబాసిడర్‌ డాక్టర్‌ బిఎం వినోద్‌ కుమార్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి వారికి తగిన సూచనలు చేసి దరఖాస్తు చేయించారు.