– ఎంఎంటీఎస్ రైళ్ల వ్యవస్థను సమీక్షించాలి
– ముఖ్యమంత్రికి సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ లేఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో అస్తవ్యస్తంగా మారిన ప్రజారవాణా, ఎంఎంటీఎస్ రైళ్ల వ్యవస్థపై సమీక్ష జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు. అత్యంత తక్కువ ఖర్చుతో ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, మరమ్మతుల పేరుతో నిరంతరం రైలు సర్వీసులు రద్దవుతుండటంతో ఎంఎంటీఎస్‌పై ప్రయాణికుల విశ్వాసం సడలిపోయిందని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు దెబ్బతినడంతో సామాన్య ప్రయాణికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అత్యంత చౌక ప్రజారవాణా అయిన ఎంఎంటీఎస్‌ను కాపాడాలన్నారు. ఎంఎంటీఎస్ ఫేస్-1లో భాగంగా హైదరాబాద్ లింగంపల్లి, ఫలక్‌నామా లింగంపల్లి వరకు రైళ్లలో నిత్యం లక్షలాదిమంది ప్రయాణించే వారని, అయితే ఇప్పుడు బాగా తగ్గిపోయిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేస్-2లో భాగంగా నాలుగు రూట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని, గత ఏడాది ప్రధానమంత్రి ఈ రూట్లలో రైళ్లను ప్రారంభించినప్పటికీ నామమాత్రంగానే నడుపుతున్నారని తెలిపారు. ఫేస్-2లో భాగంగా మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్ మధ్య ఒకటి రెండు రైళ్లను నడుపుతున్నప్పటికీ వాటిని సరైన సమయంలో నడపకపోవడంతో ప్రయాణికులెవరూ ఈ రైళ్లను ఎక్కడం లేదన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఎంఎంటీఎస్ ఫేజ్ -2 ప్రాజెక్టు పూర్తి చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయన్నారు. రాష్ట్ర వాటా నిధులు కేటాయించకుండా గత రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసి నాలుగు రూట్లు సంపూర్ణంగా పూర్తి చేసినప్పటికీ రైళ్ల సర్వీసులు నడపడంతో రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహించాయన్నారు. రైల్వేల ప్రయివేటీకరణలో భాగంగా ఎంఎంటీఎస్‌ను సైతం కేంద్ర ప్రభుత్వం వదిలించుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది పేద, సామాన్య ప్రయాణికులు అత్యంత చౌకగా ప్రయాణించే ఎంఎంటీఎస్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు ఎంఎంటీఎస్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలన్నారు. ఎంఎంటీఎస్ పనితీరుపై తక్షణమే సమీక్ష జరపాలని, ఫేస్ -2 ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా సీఎంకు విజ్ఞప్తి చేశారు.