పక్కా సంక్రాంతి సినిమా

పక్కా సంక్రాంతి సినిమా‘మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్‌ ఎమోషన్స్‌ కూడిన చాలా అద్భుతమైన సినిమా ఇది. తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్ధం నేపథ్యాన్ని తీసుకొస్తున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. మనకి సంక్రాంతిపెద్ద పండగ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా’ అని నాగార్జున అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజరు బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాతో పలు విశేషాలను పంచుకున్నారు. ‘నా సామిరంగ’ 72 రోజుల చిత్రీకరణ చేశాం. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. కీరవాణి లాంటి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉండటం మా అదష్టం. మూడు పాటలు చిత్రీకరణకి ముందే ఇచ్చారు. అలానే ఫైట్‌ సీక్వెన్స్‌కి కూడా నేపథ్య సంగీతం చేశారు. ఆ నేపథ్య సంగీతం పెట్టుకొని ఫైట్‌ చిత్రీకరణ చేశాం. ఇందులో ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. మా సినిమాకి కీరవాణే స్టార్‌. ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు స్లోగా మొదలౌతాయి. తెలుగులో వచ్చేసరికి కథ సోల్‌ మిస్‌ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్‌ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్‌ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు. ఇందులో చాలా టిపికల్‌ లవ్‌ స్టొరీ ఉంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. నాయిక ఆషికా రంగనాథ్‌కి నాకు మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడ కుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్‌ లవ్‌ స్టొరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది. తనకి మంచి ఫ్యూచర్‌ ఉంది. – దర్శకుడు విజరుకి చాలా మంచి విజువల్‌ సెన్స్‌ ఉంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్‌లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో ఉంది. అది నాకు చాలా నచ్చింది. బిన్నీ ఈ ప్రాజెక్ట్‌లోకి రాకముందే నరేష్‌ పాత్రని అనుకున్నాం. సోదరభావం ఉన్న ఆ పాత్రకు నరేష్‌ కరెక్ట్‌గా సెట్‌ అవుతారని పించింది. అలాగే రాజ్‌ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్రే. ఇక టైటిల్‌ విషయానికొస్తే నాన్న పాట నుంచి వచ్చిన టైటిల్‌ ఇది. మన కథకు బాగా  నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్‌ వినిపిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా మ్యాసీగా ఉంటాయి. నిర్మాత శ్రీనివాస చిట్టూరి వండర్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌. ఎక్కడా రాజీపడలేదు. చాలా చాలా మంచి నిర్మాత. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను.