– సందర్శించిన అశ్వారావుపేట ఎఫ్.పి.ఓ సభ్యుల బృందం..
– ముగిసిన ఎప్.పి.ఒ క్షేత్ర సందర్శన..
నవతెలంగాణ – అశ్వరావుపేట
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు,ఎకె విశ్వనాథ రెడ్డి ఆలోచనలో హనుమకొండ జిల్లా,భీమ దేవరపల్లి మండలం,ములక నూరు లో 1956 లో హైదరాబాద్ కో – ఆపరేటివ్ సొసైటీ చట్టం కింద రిజిస్టర్ చెయ్యబడిన ఆసియాలోనే రెండవ అతిపెద్ద కో – ఆపరేటివ్ బ్యాంక్ ను అశ్వారావుపేట ఆయిల్ ఫాం ఎఫ్.పి.ఓ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఆయిల్ పామ్ సాగులో ఎదురు అవుతున్న సమస్యల పరిష్కారానికై ఉమ్మడి ఐక్య కార్యాచరణ తో పాటు తెగుళ్ళు పురుగులు,గెల కోత, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు అవగాహన కల్పించడం,కల్తీ లేని ఎరువులు,క్రిమిసంహారక మందులు, జీవన ఎరువులు అన్నీ తక్కువ ధరకే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు అయిన ఈ ఎఫ్.పి.ఓ 13 మంది సభ్యులతో కూడిన బృందానికి కొక్కెరపాటి పుల్లయ్య నేతృత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా ఈ బృందం సభ్యులు గత రెండు రెండు రోజులుగా భారతీయ ఆయిల్పామ్ పరిశోధనా సంస్థ వారి సాంకేతిక సహకారంతో, మహా రాష్ట్ర కు చెందిన ఎం/ఎస్ లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి అనుబంధ సంస్ధ) ఆద్వర్యంలో క్షేత్ర సందర్శన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మెదక్ జిల్లా,కౌడిపల్లి మండలం,తునికి లో గల భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి,డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి జీవన ఎరువులు ప్రాముఖ్యతను,ప్రాధాన్యతను తెలుసుకున్నారు. రెండో రోజు బుధవారం ములక నూరు పరపతి సంఘాన్ని సందర్శించి దాని ప్రాధాన్యత,ప్రాముఖ్యత,రైతులకు అందిస్తున్న సేవలను ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ రామిరెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 7600 మంది సభ్యులతో రూ. 400 కోట్ల టర్నోవర్ తో,ప్రతి యేడాది రూ.16 కోట్ల లాభం పొందుతున్నాము అని,వరికి 100,ప్రత్తి కి 50 శాతం బోనస్, ఇన్స్యూరెన్స్,హెల్త్ కేర్, హౌజింగ్,ఎడ్యుకేషన్ లోన్ లు,ఇలా వంద రకాల సేవలు అందుబాటు లో ఉన్నాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్య,తుమ్మ రాంబాబు,తగరం జగన్నాధం,సంతపురి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.