– సీపీఐ(ఎం) ఎంపీ ద్వారా సమస్యను పరిష్కరించండి
– పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులుకు టోల్‌ప్లాజా ఉద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజాను కేంద్ర కార్మిక శాఖ ద్వారా వచ్చే కనీస వేతనాల జీవోలో సీ ఏరియా నుంచి బీ ఏరియాకు మార్చాలని నేషనల్ హైవే పుల్లూరు టోల్‌ప్లాజా ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షులు ఎ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి బి మద్దయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ పీటర్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎం) ఎంపీ ద్వారా కేంద్ర కార్మిక శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించేలా ప్రయత్నించాలని కోరారు. పుల్లూరు టోల్‌ప్లాజాలో 77 మంది కార్మికులు వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ ద్వారా ఇచ్చే కనీస వేతనాల జీవోలో పుల్లూరు టోల్‌ప్లాజా సీ ఏరియా కింద ఉందని వివరించారు. అందువల్ల తమకు జీతాలు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. తాము తెలంగాణలోని ఆలంపూర్ నియోజకవర్గం, ఏపీ కర్నూలు నగరానికి చెందిన వాళ్లం ఆ టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నామని తెలిపారు. ఇది కర్నూల్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. గతంలో పుల్లూరు టోల్‌గేటును జోగులాంబ టోల్‌గేట్‌గా మారుస్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది మార్చి 24న సర్క్యులర్ ఇచ్చారని తెలిపారు. కానీ అది ఇంత వరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ఆ సర్క్యులర్‌ను అమలు చేస్తూ పేరు మార్చడంతోపాటు కనీస వేతనాల జీవోలో సీ ఏరియా నుంచి బీ ఏరియాకు మార్చాలని కోరారు.