ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం అని నమ్మే వాళ్ళల్లో వకుళా శర్మ ముందు వరుసలో ఉంటారు. సూపర్ ఫాస్ట్ యుగంలో ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిన జనాన్ని సులభమైన మార్గంలో రసాయనాలు కలపని, పోషక విలువలు కోల్పోని పండ్లు, ఆకుకూరల ముక్కలకు అలవాటు చేసిన ఘనత ఆమెది. కాదేది ప్రయోగశాలకు అనర్హం అన్నట్టు తన కూతురు పడకగదినే ప్రయోగశాలగా మలచారు. అసలు ఈ స్మూతీల తయారీకి బీజం ఎక్కడ పడిందో తెలుసుకుందాం…
వకుళ గర్భవతిగా ఉన్నప్పుడు యు.ఎస్‌లో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లారు. సహజంగా శాఖాహారి అయిన ఆమె సమతుల్యమైన ఆహారం తీసుకొనే క్రమంలో అక్కడే ఆమెకు స్మూతీలు పరిచయమయ్యాయి. షాపుకు వెళ్ళి తానే స్వయంగా తెచ్చుకునేవారు. విభిన్నమైన ఆ రుచికి ఖిన్నురాలయ్యారు. ఇండియా తిరిగి రాగానే వాటిని తయారు చేయడానికి పూనుకున్నారు. ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసి వాటిని ఆహారంలో తీసుకుని ఆనందించేవారు. 2017లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. పచ్చి బాలింత పత్యాలు, టానిక్కులు, చేదుమందుల బెడద ఎలా వదిలించుకోవాలి? మందులతో శరీరాన్ని పోషించడం ఇష్టం లేదు. చల్ల చల్లని పానీయాలతో కడుపు నింపుకోవాలనే ఆలోచన. అందుకే బాలింతలు తీసుకోవాల్సిన పోషకాల గురించి తెలుసుకున్నారు. అవి ఏఏ పండ్లలో దొరుకుతాయో అన్వేషించారు. వాటిని తనకు నచ్చిన విధంగా తయారు చేసుకుని క్రమం తప్పకుండా తీసుకునేవారు.
ఆరు నెలల్లో మార్పులు
ఆ స్మూతిలు ఆరు నెలల్లోనే ఆమెలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాయి. చర్మం నిగనిగలాడింది, బరువు తగ్గింది, కీళ్ల నొప్పులు మటుమాయం, కళ్ళల్లో కాంతి, కురులు నిగారించాయి… ఇక తన ఆనందాన్ని అవధులు లేవు. పాపను చూడటానికి వచ్చిన బంధువులు ఈమెను చూసి ఆశ్చర్యపోయారు. వారికి తనే స్వయంగా ఆ స్మూతిలను చేసి పంచి ఇచ్చేవారు. అలా వచ్చిన వారందరికీ తన చేసి స్మూతీలు పరిచయ్యాయి. ఆ రుచికి అలవాటు పడిన వారు మెచ్చి ఫంక్షన్స్‌కి, పార్టీలకి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె పోషక విలువల పట్ల అవగాహన పెంచుకునేందుకు డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ పూర్తిచేశారు.
కలల సాకారం
అమ్మ అందించిన అనుభవాల సారం, ఇందన సహకారం, తోడు, సహజ జిజ్ఞాస ఆమెను ఆంత్రోప్రెన్యూర్‌గా మార్చాయి. వ్యాపార అనుమతుల కోసం చంటి బిడ్డను వెంటేసుకొని తిరిగారు. వెనకడుగు వేయని ధీర వనితలా పల్ప్ బ్రూ స్టార్టప్‌కు ప్రాణం పోశారు. మొదట్లో ఫ్లేవర్స్ చాలా తయారు చేశారు. ప్రచారం కోసం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కంపెనీల చుట్టూ తిరిగి చేతులు కాల్చుకున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ‘జ్యూసులు తయారు చేసుకుంటున్నాం ఇవెందుకు? సీసాల్లో స్మూతీలు ఉండగా నీ పల్ప్ బ్రూ కొనాల్సిన పని ఏముంది?’ ఇలా రకరకాల ప్రశ్నలు. అన్నింటికీ తగిన జవాబులు చెప్పారు వకుళ. అందరినీ మెప్పించారు. అపజయాలు పలకరించినా వెనుకడుగు వేయలేదు.
వి హబ్ సహకారం
బీటెక్ చదివి ఐటీ కంపెనీలో జాబ్ చేసి, ఆర్కెటెక్చర్‌లో అనుభవం ఉండటంతో తన భర్తతో కలిసి కొంత కాలం ఉద్యోగం చేశారు. తర్వాత స్నేహితురాలి సహాయంతో వి హబ్ గురించి తెలుసుకొని వారి ద్వారా తన వ్యాపారానికి ఫండింగ్ పొందారు. ఎన్నో వ్యాపార మెళుకువలు వారి నుంచే నేర్చుకున్నారు. తల్లి ప్రేరణతో మొదలైన ఆమె ప్రయాణం భర్త అజయ్ భూషణ్ సహాయ సహకారాలతో కొనసాగుతూనే ఉంది. కాన్సెప్ట్ ప్రారంభం నుండి పల్ప్‌బ్రూకి వెన్నెముకగా ఉన్నారు వారు. పండ్లు, కూరగాయలను ముక్కలు చేయడం నుండి, ట్రయల్ మిశ్రమాలను రుచి చూసి పరీక్షించడం, తుది ఉత్పత్తుల అమలు నిర్ణయాలపై ఇన్‌పుట్‌లను పంచుకోవడం, బ్లెండర్ లను హెచ్చు తగ్గులలో ఉంచడం వరకు ముఖ్య భూమిక పోషించారు అజయ్.
తయారీ విధానం
పల్ప్‌బ్రూ… పండిన పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, జాజికాయ, చియా గింజలు, అవిసె గింజలు, ఖర్జూరాలు, కోకో వంటి యాంటీ ఆక్సిడెంట్ – రిచ్ సూపర్ ఫుడ్‌లతో తయారు చేసి రెడీ-టు-బ్లెండ్ స్మూతీలను అందిస్తుంది. ఇది ఇండివిజువల్ క్విక్ ఫ్రీజింగ్ (×Qఖీ) లేదా బ్లాస్ట్-ఫ్రీజింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది. తద్వారా ఆహారం ఆకారం, రంగు, రుచి, వాసన, తాజాదనం, దాని పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది సుదీర్ఘ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంది. పదార్థాలను ఎంచుకోవడంలో, వినియోగదారు ప్రతి ప్యాక్‌లో ఉత్తమమైన పోషకాహారాన్ని పొందేలా చేయడంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే నేమో పల్ప్ బ్రూ వెయిట్ లాస్‌కి చక్కగా ఉపయోగపడుతోంది.
హైదరాబాద్‌లో మొదలై…
ఇంతులు తలచిన ఇలలో చేతకానిదేమున్నది వారి చేతిలో. ఎందులోనూ తీసిపోరుగా… అవని నుంచి ఆకాశపుటంచులదాకా… ఓర్పు నేర్పులతో ఎదిగే సత్తా మహిళలకు మాత్రమే ఉంది. యోగా గురువుగా జర్నీ మొదలు పెట్టిన వకుళశ ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. హైదరాబాద్‌లో మొదలైన వ్యాపారం నేడు బెంగుళూరు, ముంబై, పూణే తదితర నగరాలకు విస్తరించింది. ఇలా ఆమె వారు మరింత ఉన్నతిని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
– ఘాలి లలిత ప్రవల్లిక, 9603274351