
సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చివ్వేంల మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే అధికారులు సమయపాలన పాటించకపోవడం పట్ల వివిధ పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులు,మండల మహిళ సమాఖ్య ఉద్యోగులు, ఉపాధి హామీ శాఖ అధికారులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి..ఏమాత్రం సమయ పాలన పాటించడం లేదని ఉదయం వారికి యిష్టం వచ్చినప్పుడు రావడం . మధ్యాహ్నం మూడు గంటలకే విధులకు డుమ్మాకొట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారని అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు యిబ్బంది పడుతున్నారని పలువురు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మండల ప్రజా పరిషత్ కార్యాలయంతో పాటు మండల మహిళా సమైక్య కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఖాళీ కుర్చీలతో దర్శనం ఇవ్వడం కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కూడా లేక పోవడం ఆశ్చర్యం .మండల పరిధిలో ఉన్న వివిధ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉండాలి. అయితే మంగళవారం మాత్రం సాయంత్రం 5గంటలకు కాకముందే మండల మహిళ సమాఖ్య కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం తాళం వేసి ఉండడం పట్ల పలువురు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే విధుల నిర్వహణలో సిబ్బంది చిత్తశుద్ది ఏమేరకు ఉందో అర్థం అవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వివిధ శాఖల సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
