– రాజస్థాన్‌పై 5 వికెట్లతో గెలుపు
– ఛేదనలో శామ్ కరన్ అర్థ సెంచరీ
– రాజస్థాన్ 144/9, పంజాబ్ 145/5
రాజస్థాన్ రాయల్స్ తడబడింది. గువహటిలో పంజాబ్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాప్-2లో చోటుపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. 145 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలోనే ముగించింది. ఛేదనలో కెప్టెన్ శామ్ కరన్ (63 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. లోకల్ స్టార్ రియాన్ పరాగ్ (48) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 144/9 పరుగులు చేసింది.
నవతెలంగాణ-గువహటి
పంజాబ్ కింగ్స్ మురిసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల ఛేదనలో కెప్టెన్ శామ్ కరన్ (63 నాటౌట్, 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ప్రభుసిమ్రన్ సింగ్ (6), జానీ బెయిర్‌స్టో (14), శశాంక్ సింగ్ (0), సహా రోసో (22) నిరాశపర్చగా పంజాబ్ 48/4తో కష్టాల్లో పడింది. జితేశ్ శర్మ (22), ఆషుతోశ్ (17 నాటౌట్) తోడుగా కరన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. మరో ఏడు బంతులు ఉండగానే లాంఛనం ముగించాడు. రియాన్ పరాగ్ (48, 34 బంతుల్లో 6 ఫోర్లు), అశ్విన్ (28, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సంజు శాంసన్ (18, 15 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది.
ఆదుకున్న రియాన్ : టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి రెండు ఆతిథ్య మ్యాచులను గువహటిలో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కానీ కొత్త వేదిక రాయల్స్‌కు పెద్దగా కలిసి రాలేదు. భీకర ఫామ్‌లో ఉన్న బ్యాటర్ జోశ్ బట్లర్ స్వదేశం వెళ్లిపోవటంతో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ కాస్త బలహీనపడింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) నాలుగు బంతుల్లో 4 పరుగులకే వికెట్ కోల్పోయాడు. కొత్త ఓపెనర్ టామ్ (18) కాసేపు క్రీజులో నిలిచినా 23 బంతుల్లో 18 పరుగులకే పరిమితం అయ్యాడు. కొత్త బంతితో శామ్ కరన్ (2/24), అర్షదీప్ సింగ్ (1/31) నిప్పులు చెరగటంతో పవర్‌ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 38/1 పరుగలే చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ (18, 15 బంతుల్లో 3 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఈ సమయంలో లోకల్ స్టార్ రియాన్ పరాగ్ (48) మెప్పించాడు. రవిచంద్రన్ అశ్విన్ (28)తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఆరు ఫోర్లతో మెరిసిన రియాన్ పరాగ్ 48 పరుగులు సాధించాడు. కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), రోవ్‌మాన్ పావెల్ (4) సహా ఫెరీరా (7) నిరాశపరిచారు. ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (12) రెండు ఫోర్లతో మెరిశాడు. 20 ఓవర్లలో 9 వికెట్లకు రాజస్థాన్ రాయల్స్ 144 పరుగులే చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో శామ్ కరణ్, హర్షల్ పటేల్ సహా స్పిన్నర్ రాహుల్ చాహర్ రెండేసి వికెట్లతో రాయల్స్ బ్యాటర్ల దూకుడుకు ముకుతాడు వేశారు.