రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటలు సకాలంలో అమ్ముడుపోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకుంటేనే భయమేస్తున్నది.నాలుగు నెలలపాటు కంటికి రెప్పలా కాపాడుకుని నాలుగు పైసలు ఇంటికి తెచ్చుకోవడానికి ఎన్ని వ్యయప్రయాసలు పడాలో ఒక్క రైతులకే తెలుసు. విత్తనాలు వేసే దగ్గర నుంచి పంట కోత వరకు అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు. వెనుకట ధాన్యం ఇంట్లోని గుమ్మిలో నిండుగా ఉంటే సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకునే ఆనవాయితీ. విత్తనాలు నకిలీ, పురుగు మందులు నకిలీ, ఎరువులు నకిలీ, దానిపైనా అలివిగాని యాంత్రీకరణ రైతును కుంగదీస్తున్నది. అంతా బాగుంది అనుకునేలోపే అకాల వర్షాలు పంటలను కబలిస్తున్నాయి. ఇప్పుడు వానాకాలం. దాదాపు 80 శాతం పంటలు పొలాల నుంచి కళ్లాలకు చేరాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల కోతలు ఇప్పటికే పూర్తికాగా, మరి కొన్ని ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు కోనుగోళ్ల విషయంలో సర్కారు ఉమ్మడి జిల్లాల వారిగా ఐఏఎస్ అధికారులను నియమించినా పరిస్థితి చక్కబడలేదు. రైతులు కళ్లాలు, మార్కెట్ యార్డుల దగ్గర రోజుల తరబడి వేచిఉండక తప్పని దుస్థితి.
వరికోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కిలా ఉంది. వ్యవసాయాధికారులు నీమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పంటల కోతల ప్రారంభం నుంచే కొనుగోళ్లకు సన్నాహాలు చేయాల్సిన సర్కారు, అవి దాదాపు పూర్తయినా వేగం పుంజుకోలేదు. దీంతో కళ్లాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం వానలకు తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల మొలకెత్తే పరి స్థితి. జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియోకాన్ఫరెన్స్ పెట్టినా, పౌర సరఫరాల శాఖతో మంత్రి సమీక్షలు చేసినా పరిస్థితి కొలిక్కి రాలేదు. కళ్లాలు, మార్కెట్ యార్డుల్లో కనీస సౌకర్యాలు లేవు. రైతులకు సర్కారు సరఫరా చేయాల్సిన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అవసరాలకు అనుగుణంగా అందుబాటులో లేవు. అలాగే ఒక్కసారి రైతు ధాన్యం విక్ర యించాక, దాని బాధ్యత ఇక సర్కారుదే. అక్కడి నుంచి రవాణా చేసు కోవాల్సింది అధికారులే.
ధాన్యం కొనలేమంటూ మిల్లర్లు చేతులేత్తేస్తే ఇటు వ్యవసాయ శాఖ, అటు పౌరసరఫరాల శాఖ ఏం చేస్తు న్నట్టు? యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? తగినంత మేర యంత్రాంగాన్ని ఏర్పాటు చేసు కోవాల్సిన బాధ్యత సర్కారుదే కదా? ఇప్పటికే పెట్టుబడులందక ప్రయివేటు వడ్డీలు తెచ్చి అష్టకష్టాలు పడుతున్న రైతాంగాన్ని, ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కోనుగోళ్లల్లో జరుగు తున్న ఆలస్యం నష్టం చేస్తున్న మాట వాస్తవం కాదా? మనది వ్యవ సాయ ప్రధానమైన రాష్ట్రమైనా, రైతులు తమ ఉత్పత్తులను అమ్ము కోవడానికి పడే అవస్థలెన్నో. రాష్ట్రంలోని 276 యార్డులున్నాయి. ప్రధాన కేంద్రాలైన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జమ్మికుంట, కేసముద్రం, జగిత్యాల, మహబూబాబాద్ తదితర మార్కెట్లో ద్వారా ఏడాదికి రూ.120 కోట్లు వస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఆయా యార్డుల్లో ధాన్యం నిల్వ కోసం గోదాముల్లేవు. స్థలాలు ఉన్నా నిర్మాణం చేపట్టలేదు. గత బీఆర్‌ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అదే పరిస్థితిని కొనసాగి స్తుందా? కేవలం 54 యార్డుల్లోనే ఎలక్ట్రానిక్ తరహా విధానం అమలవుతుండటం గమనార్హం. కొన్ని చోట్ల వే బిడ్జ్రిలు లేవు. మరికొన్ని చోట్ల ఉన్నా, అవి పనిచేయవు. కొనుగోలు కేంద్రాలు ఎన్నున్నా, పని జరగకపోతే రైతల కేంటి ప్రయోజనం? తొలిసారిగా 91.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకు న్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నది. కానీ ఆచరణేది ?
రైతులు సున్నిత మనస్కులు అంటూనే కొను గోళ్లకు సరిగ్గా ఏర్పాట్లు చేయకుండా వారి మనస్సును నొప్పిస్తున్నది. పండిన ప్రతి గింజనూ కొంటామంటూనే అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేయకపోవడం దారుణం. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని సర్కారు అంటున్నది, మంచిదే. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి? కేవలం సన్నాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తూ, దొడ్డు బియ్యానికి ఇవ్వకపోవడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. అక్టోబరు మొదటి వారంనుంచే కొనుగోలు చేస్తామన్న పౌరసరఫరాల శాఖ మంత్రి, ఇప్పటికీ కొనుగోళ్ల వేగాన్ని పెంచడంలో విఫలమయ్యారు. ఇది నిజంగా రైతులను వంచించడమే.
ధాన్యం కొనుగోళ్లేవి?
11:19 pm