ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించాలి

Purchase of grain should be done properly– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే..-
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వానాకాలం (ఖరీఫ్) – 2024-25 సీజన్ వరి ధాన్యం (సన్న రకం, దొడ్డు రకం) కొనుగోళ్లను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్  లతో కలిసి జిల్లా కలెక్టర్  హనుమంతు కె. జండగే వానాకాలం (ఖరీఫ్) – 2024-25 సీజన్ వరి ధాన్యం (సన్న రకం, దొడ్డు రకం) కొనుగోలుపై ఏఈఓలు, డీపీఎంలు, ఏపీఎంలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని అన్నారు.అలాగే జిల్లాలో, 369 కొనుగోలు సెంటర్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులో 322దొడ్డు రకం,47 సన్న రకం వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా సన్న రకం ధాన్యంపై రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రేడ్.ఏ ధాన్యానికి క్వింటాకు 2320  మద్దతు ధర, సాధారణ రకానికి 2300 రూపాయలు గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని అన్నారు.రైతులు శుభ్ర పరిచిన ధాన్యాన్ని సెంటర్లకు తీసుకొని రావాలని  అన్నారు.ధాన్యం కొన్న మూడు రోజులోనే రైతులకు చెల్లింపు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకానికి వేర్వేరుగా రికార్డులను సరైన విధంగా నిర్వహించాలని, మూమెంట్ ప్లాన్ రిజిస్టర్ లను సన్న, దొడ్డు రకానికి వేరుగా నిర్వహించాలన్నారు.
ఈ రిజిస్టర్ లలో రైతు పేరు, ఫోన్ నంబర్, సమయం, స్థలం, రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.ఐకేపి సెంటర్లలో రైతులకు త్రాగునీరు, కూర్చోవడానికి  వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ఐకేపి సెంటర్లలో రైతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు.ఐకేపి సెంటర్ లలో ధాన్యం తడవకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ధాన్యం బస్తాలపై నెంబర్ ఉండాలని, దీనిని ప్రతి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కచ్చితంగా పాటించాలని, దొడ్డు రకాల,సన్న రకాల సెంటర్ లను ఏఈఓలు ప్రతి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. ఈ రెండు రకాల ధాన్యం తరలింపుకు వేరు వేరుగా రవాణా సౌకర్యం కలదు కల్పించాలని, ధాన్యం తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. సన్న బియ్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఓపీఎంఎస్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ వానాకాలం పంట కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ కేంద్రంలో అయినా ఈ సన్నాలకు రూ. 500 బోనస్ పట్ల అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, డయల్ గ్రెయిన్ క్యాలిబర్ లు, చెక్ పోస్టులు, టోకెన్ ల జారీ, వేయింగ్ మెషీన్ లు, ప్యాడీ క్లీనర్ లు, తదితరాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  వానాకాలం ధాన్యం కొనుగోలు లో ఏవైనా సమస్యలు తలెత్తిన రైతులు లేదా ఇతరులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ 7995120554 కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని, సంబంధిత అధికారులు ఆ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ,రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్,డీసీఎస్ఓ వనజాత  , డీఎం సిఎస్ జగదీష్ కుమార్ ,డి పి మ్ సునీల్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.