కానరాని స్వచ్ఛ భారతం

Pure India– మోడీ ఇలాకాలో పారిశుధ్యం అధ్వాన్నం
– పొంగుతున్న డ్రెయిన్లు…ఇళ్లలోకి మురుగు నీరు
– నిరుపయోగంగా పబ్లిక్‌ టాయిలెట్లు
– బహిరంగ ప్రదేశాల్లోనే మహిళల కాలకృత్యాలు
– మాన్యువల్‌ స్కావెంజర్లతో వెట్టిచాకిరీ
అహ్మదాబాద్‌ : అది ప్రధాని నరేంద్ర మోడీ ఇలాకా. దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తున్నామని ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ పుట్టి, పెరిగిన రాష్ట్రం. కానీ అక్కడ మురికివాడలు, వాటిలో నివసించే పేదల సంఖ్య తక్కువేమీ కాదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరాన్ని చూసిన వారికి మోడీ మాటల్లో నిజం నేతి బీరకాయ చందమేనన్న విషయం అర్థమవుతుంది. నగరంలోని శంకరభువన్‌ మురికివాడను చూస్తే అక్కడి పేదల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో తెలుస్తుంది. ప్రముఖులు నగరాన్ని సందర్శిం చడానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని పరదాలతో కప్పేసి పేదరికాన్ని దాచేస్తారు.జనవరి 10-12 తేదీల మధ్య నగరంలో పదవ వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ జరిగింది. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి పేదలు కనిపించకూడదని అనుకున్నారో ఏమో కానీ ఎప్పటి మాదిరిగానే శంకర్‌భువన్‌ మురికివాడను పరదాలతో కప్పేశారు. అహ్మదాబాద్‌ పాత నగరంలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. శంకర్‌భువన్‌ మురికివాడలో 400 ఇళ్లు ఉన్నాయి. దాని పక్కనే ఎప్పుడు చూసినా మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది. డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వస్తుంది. ఇది అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న శతకోటి సమస్యల్లో ఒకటి మాత్రమే.
వెయ్యి మందికి 30 మరుగుదొడ్లు
అహ్మదాబాద్‌ను బహిరంగ మల విసర్జన రహిత నగరంగా 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏర్పాటు చేసిన మొబైల్‌ టాయిలెట్లు చాలా వరకూ నిరుపయోగంగా ఉన్నాయి. శంకర్‌భువన్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ వెయ్యి మంది నివసిస్తుంటే కేవలం 30 మరుగుదొడ్లను మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ దారుణంగా ఉండడంతో పేదలు బహిరంగ ప్రదేశాల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. మరుగుదొడ్లను శుభ్రం చేసే రమేష్‌ అనే సెక్యూరిటీ గార్డు ‘ఈ మురికివాడలో అనేక టాయిలెట్లు ఉన్నాయి. కొన్నింటికి డ్రైనేజీ సౌకర్యం లేదు. కొన్నింటికి నీటి వసతి లేదు. అవన్నీ ఉపయోగంలో లేనివే’ అని చెప్పారు. పోనీ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకుందామా అంటే అక్కడ డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంటుంది. అది ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుంది. దీంతో ఆవాసాలలో నిర్మించుకున్న టాయిలెట్లు కూడా సరిగా పనిచేయడం లేదు.
ఎక్కడ చూసినా అదే సమస్య
మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ మురికివాడలోని వెయ్యి మందికి పైగా ప్రజలు బహిరంగంగానే మల విసర్జన చేస్తున్నారని మానవా భివృద్ధి-పరిశోధన కేంద్రం సభ్యురాలు షెహనాజ్‌ అన్సారీ తెలిపారు. కొన్ని మురికివాడల్లో కమ్యూనిటీ మరుగుదొడ్లు ఉన్నాయని, అయితే అక్కడ కూడా అనేక సమస్యలు కన్పిస్తున్నాయని ఆమె చెప్పారు. చంద్‌ఖేడా ప్రాంతంలోని లక్ష్మీనగర్‌ నా చప్ర, ఘోడా క్యాంప్‌, అసర్వా, కేశవానినగర్‌లోని మురికివాడల్లోనూ మరుగుదొడ్ల సమస్య ఉన్నదని ఆమె వివరించారు.
సిగ్గు పడుతూ… భయం భయంగా
శంకర్‌భువన్‌ మురికివాడలో నివసిస్తున్న మహిళలు ఉదయం ఐదు గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటికి వెళతారు. ముఖాలు కన్పించకుండా బట్ట చుట్టుకుంటారు. పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదంటే మూత్ర విసర్జన సమయంలో కూడా కొందరు మహిళలు అడ్డుగా నిలబడాల్సి వస్తోంది. ఇక నెలసరి ఇబ్బందులు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. బహిరంగంగా మల మూత్ర విసర్జన చేయడానికి సిగ్గు పడాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు భయం కూడా వేస్తుందని వారు చెప్పారు. మరుగుదొడ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటి నిర్వహణ బాధ్యతను కూడా కార్పొరేషన్‌ చేపట్టాలని వారు కోరుతున్నారు. సమీపంలోనే ఉన్న ఫ్లై ఓవర్‌ కిందనే పలువురు మహిళలు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పోకిరీల బెదద కూడా తప్పడం లేదని వారు భయం భయంగా చెప్పారు. ‘అభివృద్ధి చెందామని, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచామని సంబరాలు చేసుకుం టారు. కానీ మా గోడు ఎవరూ వినరు. మాకు మద్దతు ఇవ్వరు. ప్రభుత్వం మమ్మల్ని చంపేసేలా ఉంది’ అని వారు వాపోయారు. పులి మీద పుట్రలా మురికివాడ ప్రజలు మరో ఉపద్రవాన్ని ఎదుర్కొం టున్నారు. దీనిని ప్రైవేటు బిల్డర్లకు అమ్మేశామని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.
విముక్తి ఎక్కడ ?
జనవరి 2వ తేదీన తూర్పు అహ్మదాబాద్‌లోని బాపూ నగర్‌ వార్డులో ఓ పారిశుధ్య కార్మికుడు డ్రైనేజీని శుభ్రం చేస్తూ అందులో పడి మరణించాడు. పని వారితో డ్రైనేజీలను శుభ్రం చేయించకూడదని చట్టం అమలులో ఉన్నప్పటికీ దానిని పట్టించుకునే నాథుడే లేడు. 2019 అక్టోబర్‌ 2న జాతిపిత జయంతి రోజు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తమ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా బహిరంగ మల విసర్జన నుండి దేశం విముక్తి పొందిందని ఆయన గొప్పగా ప్రకటించారు. కానీ నగరంలో నివసిస్తున్న 1200 వాల్మీకి కుటుంబాలకు నేటికీ బహిరంగ మల విసర్జనే దిక్కవుతోంది. నగరంలో కనీసం 200 ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి బహిరంగ మల విసర్జన నుండి ఇప్పటి వరకూ విముక్తి లభించలేదు. శంకరభువన్‌, షాపూర్‌, మిర్జాపూర్‌, నారోల్‌, వాత్వా, జునా వాడజ్‌, షావాడి, నాగోరివాద్‌ ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ కాలకృత్యాల కోసం బహిరంగ ప్రదేశాలకు వెళుతునే ఉన్నారు. ఆ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులు తమ చేతులకు పని చెబుతూనే ఉన్నారు.