పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమా

Pure mass commercial movie‘ఒకప్పటి వైజాగ్‌ గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. ఒక కథకుడిగా దీన్ని ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో ఒక షార్ట్‌ స్టోరీగా రాయాలనుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్‌ అని అర్థమైంది. దాని ఫలితమే ‘మట్కా’ సినిమా’ అని అన్నారు దర్శకుడు కరుణ కుమార్‌. వరుణ్‌ తేజ్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు.
మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేడు (గురు వారం) ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
మన దగ్గర అద్భుతమైన కథలు, సాహిత్యం ఉంది. మనం తీసినన్నీ గొప్ప సినిమాలు ఎవరూ తీయలేదు. ‘మాలపిల్ల’ అనే సినిమా అందరికంటే ముందు మనం తీశాం. గొప్ప సాహిత్యం, కథలు, కల్చర్‌ ఉన్న తెలుగు నేల మనది. తమిళం, మలయాళం కంటే సూపర్‌ రూటెడ్‌ కథలు మన దగ్గర ఉన్నాయి. ‘మట్కా’ నా స్టయిల్‌ అఫ్‌ స్టోరీ టెల్లింగ్‌తో అందరినీ అలరించేలా తెరకెక్కించాను. ఇది పక్కా కమర్షియల్‌ సినిమా. చాలా స్టయిలీష్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో చేసిన సినిమా కూడా.
ఇది ఒక మనిషి లైఫ్‌ జర్నీ. బర్మా నుంచి వైజాగ్‌కి వాసు ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్‌లో ఉన్న పెద్ద పెద్ద పవర్‌ఫుల్‌ పర్సన్స్‌ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్‌ వెనుక ఉన్న క్రైమ్‌, గ్లామర్‌, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ ఇవన్నీ కథలో భాగమే. అలాగే మట్కా ఎలా వచ్చింది.. దాన్ని ఎలా కొనసాగించారు?, సెల్‌ఫోన్‌ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్‌ని పంపించడం అనేది ఈ కథలో చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. వాసుగా వరుణ్‌ తేజ్‌ది వన్‌ ఆఫ్‌ ది ఫైనెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌. 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి ప్రస్తావిస్తారు. కథానుగుణంగా జీవీ ప్రకాష్‌కుమార్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం అత్యద్భుతంగా ఉంది. మేకింగ్‌ విషయంలో మా నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.