స్వచ్ఛదనం – పచ్చదనం అంతంతే..!

Purity - Greenness is the end..!నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది.ఈ ప్రక్రియ కేవలం ఐదు రోజులకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగితేనే గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడనుంది. ఈ కార్యక్రమం అమలు చెప్పుకోవడం వరకే బాగుంది. ఆచరణలో అది ఆశించినస్థాయిలో కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంతమేర పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగు పడుతుందనేది వాస్తవం. ఇంకా చాలా చోట్ల వ్యర్థాలు పేరుకుపోవడంతో ఆయా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ అధ్వానంగా ఉంది.
కొరవడిన ప్రజాభాగస్వామ్యం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఐదు రోజులపాటు చేపట్టే కార్యక్రమాల ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ఆ దిశగా ముందుకెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు మాత్రమే ప్రజలు భాగస్వాములయ్యారు. మిగిలిన రోజుల్లో సిబ్బందితో చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని మురుగు కాల్వల్లో వ్యర్థాలు తొలగించడం, వీధుల్లోని రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, బావులు, తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పొడి చల్లడం, గోతుల్లో నీరు నిల్వ లేకుండా మట్టి పోయడం, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర కార్యక్రమాలు సిబ్బంది చేత నిర్వహిస్తున్నారు.మండలంలోని తాడిచెర్ల, రుద్రారం,పెద్దతూoడ్ల గ్రామాల్లో అంతర్గత రోడ్లపై,డ్రైనేజీల్లో చెత్తను తొలగించినప్పటికీ మళ్ళీ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో వార్డుల్లో అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది.నాలుగు రోజులుగా స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం కొనసాగుతున్నా.. ఇక్కడి చెత్త తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. పరిసరాల్లో దుర్వాసన వ్యాపిస్తుందని, దోమల తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు.
నిరంతరం కొనసాగిస్తాం: ఎంపిడిఓ శ్యాంసుందర్
స్వచ్చదనం,పచ్చదనం కార్యక్రమం శుక్రవారంతో ముగుస్తున్నప్పటికీ.కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం కొనసాగిస్తాం. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ప్రభుత్వ సంస్థల్లో వారంలో ఒక రోజు ఒక గంట పాటు ఎవరి సంస్థలో వారు శ్రమదానం చేసుకుంటే ఆ సంస్థ పరిసరాలన్నీ శుభ్రంగా తయారవుతాయి. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తాం. గ్రామాలల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం నిత్యం జరిగే కార్యక్రమమే. స్థానికులు చెత్తను ఎక్కడ పడితే అక వేయకుండా పంచాయతీ ఏర్పాటు చేసిన కుండీల్లో వేయాలి.