న్యూఢిల్లీ : చైనా అనుకూల ప్రచారం కోసం సొమ్ము తీసుకున్నారని ఆరోపిస్తూ ఉగ్రవాద నిరోధక ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల అభివృద్ధి విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిని ఢిల్లీ కోర్టు మంగళవారం పది రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వీరిద్దరినీ మధ్యాహ్నం 2.50 గంటల ప్రాంతంలో అదనపు సెషన్స్ జడ్జి హర్‌దీప్ కౌర్ ఎదుట హాజరు పరిచారు. నిందితులను పది రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించాలని ప్రాసిక్యూషన్ కోరగా పుర్కాయస్థ న్యాయవాది దానిని వ్యతిరేకించారు. తన క్లయింటుకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ లభించలేదని తెలిపారు. ‘నా క్లయింట్ ఎలాంటి ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు? ఓ పాత్రికేయుడిగా తను అలాంటి చర్యకు ఎలా పూనుకోగలడు? ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ఆరోపణలేమిటి? కోవిడ్ సమయంలో ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ వార్తలు ఇచ్చారు. రైతుల ఆందోళనలను గురించి వార్తలు అందించారు. అది ఉగ్రవాదమా?’ అని పుర్కాయస్థ న్యాయవాది వాదించారు. వారు నేరం చేశారని అనుమానించినప్పటికీ జ్యుడీషియల్ కస్టడీకి పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని తెలిపారు. కాగా చక్రవర్తి పాత్రికేయుడు కాదని, ఎలాంటి చెల్లింపులు స్వీకరించలేదని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌ను చూపకుండా న్యూస్‌క్లిక్ పోర్టల్ భారత చిత్రపటాన్ని ప్రచురించిందన్న ఆరోపణలోనూ వాస్తవం లేదని తెలిపారు. ఈ కేసు ఆధారాలు సేకరించే దశలోనే ఉన్నదని, నిస్పాక్షికంగానే ప్రాసిక్యూషన్ నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కోరిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పుర్కాయస్థ, చక్రవర్తిని న్యాయస్థానం పది రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.