పురుషోత్తంరావు ఆశయ సాధనకు కృషి

Adilabad– ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు
నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు ఆశయ సాధనకు కృషి చేస్తానని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు అన్నారు. పురుషోత్తంరావు 25వ వర్దంతిని పురస్కరించుకొని పట్టణంలోని పటేల్‌ గార్డెన్‌లో మెగా హెల్త్‌ క్యాంప్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ క్యాంప్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పురుషోత్తంరావుపై నియోజకవర్గ ప్రజలకు నేటికీ అభిమానం ఉండడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. ప్రజాబంధు ఫౌండేషన్‌ పేరుతో ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 8 వేల మందికి లయన్స్‌ క్లబ్‌ సహకారంతో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించినట్లు తెలిపారు. ఈ వైద్యశిబిరానికి 20 మంది ప్రత్యేక వైద్య నిపుణులు రాగా వారు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగానే రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌, ఈసీజీ, 2డి ఇకో పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన వైద్యులను ఎమ్మెల్యే హరీష్‌బాబు సన్మానించారు. కార్యక్రమంలో డిప్యుటీ డీఎంహెచ్‌ఓ సీతారాం నాయక్‌, పలువురు వైద్యనిపుణులు పాల్గొన్నారు.