రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. రామ్ భీమన దర్శకుడు. ప్రకాష్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. నిర్మాత డా.రమేష్ తేజావత్ మాట్లాడుతూ, ‘ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చూసే ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశామని గర్వంగా చెప్పగలను. మా మూవీ కోసం రాజ్ తరుణ్ 100కి 101 పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే హీరోయిన్ హాసిని 104 ఫీవర్‌లో కూడా షూటింగ్ చేసింది. మా డైరెక్టర్ రామ్ భీమన డెడికేషన్ ఉన్న డైరెక్టర్. ఈ చిత్రాన్ని మీ అందరికీ నచ్చేలా అందంగా రూపొందించారు’ అని తెలిపారు. ‘రామాయణం అంత రమణీయంగా, భారతం అంత భారీగా మన సినిమా ఉండాలని మా నిర్మాత చెప్పారు. ఆయన చెప్పినట్టే ఈ సినిమా రూపొందించాను. నా గత రెండు సినిమాలు ‘ఆకతాయి’, ‘హమ్‌తుమ్’ అంతగా ఆదరణ పొందలేదు. ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ హిట్ చేయాలనే పట్దుదలతో వర్క్ చేశాను. అందరూ చూసే కలర్‌ఫుల్ మూవీ’ అని డైరెక్టర్ రామ్ భీమన చెప్పారు.