– సీఎండీికి సీఐటీయూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణికే బొగ్గు బావులు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సింగరేణి చైర్మెన్,మేనేజింగ్ డైరెక్టర్ బలరాంకు సీఐటీయూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ( సీఐటీయూ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, యూనియన్ నాయకులు బాలాజీ, రాములు ఎమ్‌డీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 21న దేశవ్యాప్తంగా 61 బొగ్గు బావులను వేలం వేసేందుకు ప్రక్రియను ప్రారంభించిందని గుర్తు చేశారు. ఇందులో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను కూడా వేలంలో పెట్టారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా కార్మికులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి శ్రావణపల్లి బ్లాక్ కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలని వారు విజ్ఞప్తి చేశారు. మినరల్ , మైన్స్ డెవలప్‌మేంట్ రెగ్యులేషన్ చట్టంలో సెక్షన్ 17 ఏ ప్రకారం కేంద్రం బొగ్గు బావులను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించడానికి అవకాశం ఉందని గుర్తు చేశారు. రానున్న 10 ఏండ్లలో సగం సింగరేణి బొగ్గు బావులు మూతపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కొత్త బావులు సాధించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ప్రతి ఏడాది రూ.8వేల కోట్లను వివిధ రూపాల్లో చెల్లిస్తుందని తెలిపారు. ఇలాంటి సంస్థను ప్రయివేట్ వారికి అప్పగించొద్దని విజ్ఞప్తి చేశారు. సింగరేణికి జేన్ కో, ట్రాన్స్ కో నుంచి రూ. 30వేల కోట్లు బకాయిలున్నాయనీ, వాటిని రాబట్టాలని కోరారు. ఈ సందర్బంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ..కేంద్ర గనుల శాఖ మంత్రికి బొగ్గు బావులు సింగరేణికి కేటాయించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో బొగ్గు బ్లాకులను ప్రయివేట్ వారికి ఇవ్వటం వలన నష్టపోయమని గుర్తు చేశారు. కోయగూడెం, సత్తుపల్లి, బ్లాకులను పొందలేక పోయామని తెలిపారు. కేంద్రం సింగరేణికి కేటాయిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను కేటాయించేవరకు అన్ని సంఘాలతో కలిసి పోరాడతామని యూనియన్ నాయకులు తెలిపారు.