ఘనంగా పుష్ప వైల్డ్‌ ఫైర్‌ జాతర

Pushpa wild fire fairఅల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కలయికలో రాబోతున్న చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల5వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ఘనంగా పుష్ప వైల్డ్‌ ఫైర్‌ జాతర పేరుతో ఓ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ, ‘ఇటీవల పుష్ప షూటింగ్‌కి వెళ్ళినప్పుడు సుకుమార్‌ నాకు సినిమాలోని ఒక సీన్‌ చూపించారు. ఆ సీన్‌ పుష్పరాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. అది చూస్తేనే నాకు అర్థం అయిపోయింది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. వెంటనే దేవి శ్రీ ప్రసాద్‌ నుండి ఎంత మ్యూజిక్‌ చేయించుకోగలరో అంత చేయించుకోండి అని అన్నాను. ఇక ఈనెల 4 సాయంత్రం నుండి ఈ సినిమా ఎలా ఉండిపోతుందనేది ప్రపంచం అందరికీ తెలిసిపోతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్‌ రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని రష్మిక మందన్న చెప్పారు. దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాని కేవలం బన్నీ మీద ఉన్న ప్రేమతోనే తీశాను. బన్నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు బన్నీకి థ్యాంక్స్‌’ అని తెలిపారు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, ‘సుకుమార్‌ గురించి చెప్పాలి అంటే పుష్ప అనేది సుకుమార్‌ సినిమా. ఈయనను చూసి ఇంత గొప్ప డైరెక్టర్‌ తెలుగులో ఉన్నాడా అనుకునేలా పనిచేస్తారు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారు అనడం కంటే తమ జీవితాలను పెట్టేసారు అనడం కరెక్ట్‌. నేను ఇప్పుడు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఈనెల 5వ తేదీన సినిమా చూశాక మీకు ఆ విషయం అర్థమవుతుంది’ అని అన్నారు.