లక్షలు పెట్టు..పోస్టు పట్టు!

 Put lakhs.. Get the post!– రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని
– తహశీల్దార్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌
– రూ.10లక్షలు ఇస్తేనే అనుకున్న మండలం
– ఇదీ రెవెన్యూశాఖ బాగోతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో జరరగుతున్న బదిలీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈనెల 31వరకు బదిలీలు పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓ బదిలీల ప్రక్రియను రెవెన్యూశాఖ పూర్తిచేసింది. ఇక మిగిలింది తహసీల్దార్ల బదిలీలు మాత్రమే. ధరణి వచ్చిన తర్వాత తహసీల్దార్లకు పెద్దగా అధికారాల్లేకపోయినా గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మండలాల పోస్టులు మాత్రం హాట్‌కేక్‌లా మారాయి. లక్షల రూపాయలు ఇచ్చి ఈ పోస్టులను కొనుగోలు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ధరణితో వివాదాల్లో ఉన్న ఈ శాఖ బదిలీలతో మరింత విమర్శలపాలవుతోంది.రాష్ట్రంలో 33 జిల్లాలు, 71 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. వీటిల్లో 613 మండలాలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లాల్లోని మండలాల తహసీల్దార్‌ పోస్టులకు భారీగా డిమాండ్‌ పెరుగుతున్నది.
పోస్టుకు రూ.10లక్షలు
రెవెన్యూ శాఖలో కీలకంగా ఉన్న తహసీల్దార్ల బదిలీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 27, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని 15, సంగారెడ్డి జిల్లాలోని 5 మండలాలు, యాదాద్రి జిల్లాల్లోని 17 మండలాల పోస్టులకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఒక్కో పోస్టుకు రూ.10లక్షల చొప్పున నడుస్తున్నదని వినికిడి. దీని కోసం జోరుగా ఫైరవీలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్‌లో నూ ఇదే తంతు జరుగుతున్నదని, తహసీల్దార్ల పోస్టింగ్‌లకు ఓ ఉద్యోగ సంఘం నేత, సబ్‌రిజిష్ట్రార్ల పోస్టులకు మరో ఉద్యోగ సంఘం నేత బాధ్య త తీసుకుని ఈ తంతంగాన్ని నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.