జి 20 సదస్సుకు పుతిన్‌ హాజరు?

– రష్యా రాయబారి వ్యాఖ్యలు
– భారత్‌, రష్యా సహకారాన్ని ఎవరూ దెబ్బ తీయలేరు !
న్యూఢిల్లీ: భారత్‌లో జి 20 సదస్సు నిర్వహణ, రష్యాకి సంబంధించినంతవ రకు అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు వున్నాయని సీనియర్‌ రష్యన్‌ దౌత్యవేత్త ఒకరు సూచనప్రాయంగా తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాల నాయకులను పుతిన్‌ మొదటిసారిగా ముఖాముఖి కలుసుకునే అవకాశం దీంతో ఏర్పడనుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతి వారం నిర్వహించే పత్రికా సమావేశంలో అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి సమాధానమిస్తూ, సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20సదస్సుకు పుతిన్‌ను స్వాగతించేందుకు మోడీ ప్రభుత్వం ఎదురుచూస్తోందని చెప్పారు. ఈ ఏడాది కీలక కార్యక్రమాల్లో ఈ సదస్సు ఒకటిగా భారత్‌ భావిస్తోందన్నారు. సదస్సు నిర్వహణకు అన్ని సన్నాహక చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పుతిన్‌ పర్యటనా వివరాలు తెలుస్తాయని రష్యన్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ రోమన్‌ బాబుషికిన్‌ హిందూకు ఇచ్చిన రాతపూర్వక ఇంటర్వ్యూలో తెలిపారు. జి20 సదస్సు విజయవంతం కావడానికి భారత్‌ అధ్యక్ష వర్గానికి మద్దతిచ్చేందుకు రష్యా కృత నిశ్చయంతో వుందని చెప్పారు. గతేడాది బాలిలో జరిగిన జి20 సదస్సులో ఉక్రెయిన్‌ గురించి వున్న పేరాగ్రాఫ్‌లపై సంతకం చేసిన విషయాన్ని గమనంలోకి తీసుకుంటే ఢిల్లీ ప్రకటనపై రష్యా, చైనాలు ఎందుకు ఏకాభిప్రా యాన్ని కలిగివున్నాయని ప్రశ్నించగా, ఆర్థికాంశాలను చర్చించేందుకు ఉద్దేశించిన జి20 సదస్సును రాజకీయం చేయడం ద్వారా భారత్‌ అధ్యక్షవర్గ బాధ్యతలను పశ్చిమ దేశాలు దెబ్బతీస్తున్నాయని రష్యా రాయబారి వ్యాఖ్యానించారు.