రష్యాపై ఎదురుదాడి : ఉక్రెయిన్‌కు పుతిన్‌ హెచ్చరిక!

ఉక్రెయిన్‌పై 2022లో రష్యా ప్రారంభించిన సైనికచర్యకు 900 రోజులు పూర్తయ్యాయి. తాజా పరిణామం ఏమంటే తమ సేనలు రష్యాలోని కురుస్క్‌ ప్రాంతంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేరకు ఆక్రమించుకున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించాడు.విస్తీర్ణం ఎంత అనే దాని మీద భిన్న కథనాలు వచ్చాయి. తమ భద్రత కోసమే ఈ దాడులన్నాడు. రష్యా ప్రభుత్వం అక్కడి జనాభాను ఇతర ప్రాంతాలకు తరలించింది. తగిన శాస్తి అనుభవించటానికి ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉండాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్‌ తన బలాలన్నింటినీ కూడగట్టుకొని ఈ దాడి ద్వారా సాధించేదేమిటి, ఆక్రమించుకున్న ప్రాంతాలను ఎంతకాలం నిలుపుకుంటుందన్నది ఒక ప్రశ్న. ఈ పరిణామం సంక్షోభ తీరుతెన్నులనే మార్చివేసిందా అన్న రీతిలో మథనం జరుగుతోంది. కొందరు వర్ణిస్తున్నట్లు నాటకీయంగా, ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో రష్యా ఆశ్చర్యపోయిందా? ఏ మాత్రం పసిగట్టలేదా? ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సిబ్బందిని, సాయుధ వాహనాలను తరలిస్తున్నట్లు రష్యా మిలిటరీ ప్రకటించింది. నలభై కిలోమీటర్ల వెడల్పున పన్నెండు కిలోమీటర్ల మేరకు ఉక్రెయిన్‌ సేనలు చొచ్చుకొని వచ్చాయని 28 జనావాసాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మొత్తం లక్షా 80వేల మంది పౌరులకుగాను లక్షా 21 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించినట్లు కురుస్క్‌ గవర్నర్‌ సోమవారం నాడు ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సేనల నష్టాలు పెరుగుతున్నాయని, పోరుకు సిద్ధంగా ఉన్న దళాలన్నింటినీ జెలెన్‌స్కీ సరిహద్దులకు తరలిస్తున్నాడని, తగిన శాస్తి అనుభవిస్తారని పుతిన్‌ టీవీ ప్రసంగంలో చెప్పాడు. అయితే కురుస్క్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్న జనాన్ని కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌ జపోర్‌ఝియా అణువిద్యుత్‌ కేంద్రం రష్యా అదుపులో ఉంది. మూతపడి ఉన్న ఆ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దానికి కారకులు మీరే అంటూ ఉక్రెయిన్‌-రష్యా పరస్పరం ఆరోపించుకున్నాయి. అయితే ఎలాంటి అణుధూళి వెలువడలేదని, మంటలను ఆర్పివేసినట్లు వార్తలు. మరోవైపున ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తతలు సడలటానికి మూడు సూత్రాలను పాటించాలని ఈ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా సూచించింది.యుద్ధరంగాన్ని విస్తరించకుండా,పోరు మరింతగా దిగజారకుండా చూడటంతో పాటు ఏ పక్షమూ మంటను ఎగదోయవద్దని పేర్కొన్నది. తాము ఏ పక్షానికీ మారణాయుధాలను అందించటం లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పాడు.
తనకు వ్లదిమిర్‌ పుతిన్‌,ఉత్తర కొరియా నేత కిమ్‌ బాగా తెలుసునని, వారిద్దరూ ఎంతో హుందా అయినవారని, ఉక్రెయిన్‌ పోరుకు కారకుడు అధ్యక్షుడు బైడెన్‌ అని డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించాడు. అతను గెలిచి ఉండకపోతే పోరు వచ్చేదే కాదన్నాడు. ‘ఎక్స్‌’ అధినేత ఎలన్‌ మస్క్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుతిన్‌తో తనకు బలమైన సంబంధాలున్నందున తానైతే వివాదాన్ని నివారించి ఉండేవాడినని మరోమారు అన్నాడు.ట్రంప్‌ చెప్పింది నిజమే అని ఎలన్‌ మస్క్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ మీద దాడి చేయవద్దని, అది నీవల్ల కాదని తాను పుతిన్‌తో చెప్పానని అయితే తనకు మరొక మార్గం లేదని అన్నాడని, కాదు మార్గం ఉందని తాను చెప్పినట్లు ట్రంప్‌ వెల్లడించాడు.తాను ఎన్నికైతే అధికారం చేపట్టకముందే 24 గంటల్లో వివాదాన్ని పరిష్కరిస్తానని కూడా పునరుద్ఘాటించాడు. తాను ఎన్నికైతే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తాననే హామీ ఇవ్వలేనని గతేడాది మేనెలలోనే ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. క్రిమియా, డాన్‌బాస్క్‌ ప్రాంతాలను రష్యాకు అప్పగిస్తే వెంటనే సైనికచర్య ముగుస్తుందని ప్రైవేటు సంభాషణల్లో ట్రంప్‌ చెబుతున్నాడు.
తమకు పూర్తి స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని మిత్రదేశాలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశాడు.పోరు దీర్ఘకాలం సాగుతుందని, కష్టతరంగా ఉంటుందని ఉక్రెయిన్‌ మాజీ మిలిటరీ అధికారి ఒకడు చెప్పాడు.రష్యా ప్రాంతంపై జరుగుతున్న దాడిలో తొమ్మిదంతస్తుల భవనం మీద పడిన ఉక్రెయిన్‌ క్షిపణి కారణంగా 13 మంది గాయపడినట్లు తప్ప ప్రాణనష్టం గురించి ఇంతవరకు ఇతరంగా వార్తలు రాలేదు. తాము నాలుగు ఖండాంతర క్షిపణులను, 14డ్రోన్లను కూల్చివేయటంతో పాటు చొరబాటును నిలువరించినట్లు రష్యా ప్రకటించింది.సైనిక చర్య ప్రారంభమైన తరువాత తమ గడ్డపై కొన్ని సందర్భాల్లో ఎదురుదాడులు చేసినా రష్యా భూభాగంపై దాడికి దిగటం ఇదే ప్రధమం. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఐదోవంతు ప్రాంతం రష్యా లేదా దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉంది. దాన్ని విడిపించుకొనేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలను దెబ్బతీసి వెన్ను విరుస్తున్నది.అమెరికా, ఇతర నాటో దేశాలు అందిస్తున్న వందల కోట్ల డాలర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలు దేనికీ కొరగాకుండా పోతున్నాయి. ఆగస్టు ఐదవ తేదీ నుంచి జెలెన్‌స్కీ సేనలు దాడులను ప్రారంభించినప్పటికీ రష్యన్లు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. వ్యూహాత్మకంగా రానిచ్చారా, పసిగట్టలేకపో యారా లేక తగిన సన్నాహాలు లేవా? బాగా లోపలకు రానిచ్చి చుట్టు ముట్టాలన్న ఎత్తుగడ కూడా ఉందంటున్నారు. గతేడాది అక్టోబరులో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే యంత్రాంగం, నిఘావున్న ఇజ్రాయిల్‌ కూడా ఇనుపకంచెను బద్దలుకొట్టి తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయటం, అనేక మందిని హతమార్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన హమాస్‌ సాయుధుల చర్యలను పసిగట్టలేక పోవటాన్ని చూశాము. ఇప్పటికీ ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నది. దీని అర్ధం ఇజ్రాయిల్‌ మిలిటరీ కంటే హమస్‌ గొప్పదనా? అలాగే రష్యన్లు ఆదమరచి ఉన్న సమయంలో ఉక్రెయిన్‌ కూడా ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు. పెద్దగా ఆయుధాలు లేని కాపలాదారులు, పదాతి దళాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని గతంలో మాదిరి చిన్న చిన్న బృందాలకు బదులు భారీ సంఖ్యలో వారం రోజుల క్రితం పలు వైపుల నుంచి మెరుపుదాడులు చేసినట్లు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో డ్రోన్లతో పదివేల మంది సైనికులు ఈ దాడిలో పాల్గొన్నట్లు, రష్యన్‌ డ్రోన్లను పనికిరాకుండా చేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. యుద్ధవిమానాలు, హెలికా ప్టర్లతో దాడిని నిలువరించినట్లు, నాలుగు రోజుల్లో 945 మంది ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు రష్యా చెబుతున్నది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య 1,974కిలో మీటర్ల భూ, 321కిలో మీటర్ల సముద్ర సరిహద్దు ఉంది. ఇంతపొడువునా సేనలను మోహరించటం ఏ దేశానికీ సాధ్యం కాదు.ఈ కారణంగానే కేంద్రీకరణ తక్కువగా ఉన్న కురుస్క్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతం మాస్కోకు 530కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ రష్యానుంచి ఐరోపాకు సరఫరా చేసే సుదఝా సహజవాయు పంప్‌ స్టేషన్‌ తప్ప ఇతరంగా ముఖ్యమైనవేవీ లేవు.దాన్ని ముట్టడించేందుకు ఉక్రెయిన్‌ చూస్తున్నది.
ఉక్రెయిన్‌ దాడితో ఏం జరిగింది? ఏం జరగనుందన్నది చర్చ. ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌ ప్రాంతంపై కేంద్రీకరించి ముందుకు సాగుతున్న రష్యా సహజంగానే తన బలగాలను కురుస్క్‌వైపు కేంద్రీకరిస్తుంది. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ మిలటరీ ఉక్రెయిన్‌తో ఉన్న తమ సరిహద్దులో బలగాలను కేంద్రీకరిస్తున్నట్లు సంకేతాలు పంపింది. కురుస్క్‌ మీద దాడి సందర్భంగా ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని అతిక్రమించిందని బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో పేర్కొన్నాడు. తమ దళాలు అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూడా చెప్పాడు. ఇది తమను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదని, తిప్పికొడతామని రక్షణ మంత్రి ప్రకటించాడు. అంటే జెలెన్‌స్కీ సేనలు పూర్తిగా రష్యా మీద కేంద్రీకరించటం సాధ్యం కాదు. ఇది కూడా రష్యా ఎత్తుగడల్లో భాగమే అన్నది స్పష్టం.ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తారు, యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. తాజా దాడి రష్యాతో బేరసారాలాడేందుకు జెలెన్‌స్కీ వేసిన ఎత్తుగడగా కూడా కొందరు వర్ణిస్తున్నారు. సోమవారం నాడు పుతిన్‌ కూడా అదే చెప్పాడు. శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో తన పశ్చిమ దేశాల యజమానుల సాయంతో పరిస్థితిని మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఇది అన్నాడు. ఒక వేళ ఉక్రెయిన్‌ పరాభవం పాలైతే దానికి కొత్తగా పోయేదేమీ లేదు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా గడ్డ మీద 900 రోజులు సాగిన మిలిటరీ చర్య లేదా యుద్ధం ఇది తప్ప మరొకటి లేదు. రష్యాను ఓడించేందుకు మనమెందుకు ఉక్రెయిన్‌కు సాయం చేయాలి, దానివలన మనకొచ్చే లాభం ఏమిటన్న ప్రశ్న అమెరికాలో తలెత్తుతున్నది. నవంబరులో జరిగే అధ్యక్ష, ఇతర ఎన్నికల్లో ఈ అంశాన్ని ముందుకు తెచ్చి లబ్ది పొందేందుకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ట్రంపు గెలిస్తే తాము మునిగినట్లే అని ఉక్రెయిన్‌ భయపడుతున్నది.
డెమోక్రాట్లు గెలిచినా ఎంత మేరకు, ఎంతకాలం మద్దతు ఇస్తారన్నది సందేహమే. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్నది రష్యా ప్రధానమైన షరతు. దానికి అమెరికా, ఇతర నాటో దేశాలు ససేమిరా అంటున్నాయి. రష్యా సైనిక చర్యవెనుక ఉన్న కీలక అంశమిదే. క్రిమియాతో పాటు స్వాతంత్య్రం ప్రకటించుకున్న, రష్యా ప్రభావంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించి సార్వభౌమత్వానికి హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. యుద్ధ సమయంలో శత్రు సంహరణకంటే ముందు నిజం చచ్చిపోతుంది. రష్యా మిలిటరీ చర్య ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాల మీడియా ప్రచారం అంతా పుతిన్‌ సేనల ఓటమి ఈ క్షణమో మరో క్షణంలోనో జరగబోతోదని గత 900 రోజులుగా చెబుతూనే ఉంది. అదే మాదిరి పుతిన్‌ కూడా కొద్ది రోజుల్లోనే జెలెన్‌స్కీని తన కాళ్ల వద్దకు రప్పించుకుంటానని చెప్పాడు. రెండూ జరగలేదు. దాడుల పద్ధతులు, ఎత్తుగడలూ మారాయి.ఇంతవరకు ఎటువైపు ఎంత మంది మరణించిందీ ఎవరూ నిజం చెప్పటం లేదు.కురుస్క్‌ ప్రాంతం నుంచి ఈ ఏడాది తమ మీద రెండువేల సార్లు వైమానిక దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ తాజా దాడితో పెను మార్పులు వచ్చే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు.

– ఎం కోటేశ్వరరావు, 8331013288