రష్యా అధ్యక్ష ఎన్నికలలో పుతిన్‌ చారిత్రాత్మక విజయం

రష్యా అధ్యక్ష ఎన్నికలలో పుతిన్‌ చారిత్రాత్మక విజయంమాస్కో : రాష్యా అధ్యక్ష ఎన్నికలలో వ్లాడీమీర్‌ పుతిన్‌ చారిత్రాత్మక విజయం సాధించాడని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సోమవారంనాడు అధికారికంగా ప్రకటించి, ఫలితాలను వెల్లడించింది. పుతిన్‌ 87.28% రికార్డు స్థాయిలో ఓట్లనుసాధించి, ఐదవసారి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. పుతిన్‌ అభ్యర్థిత్వాన్ని 75 మిలియన్లకు పైగా ఓటర్లు బలపరిచారు. 2024 అధ్యక్ష ఎన్నికలో పుతిన్‌ ప్రత్యర్థులైన కమ్యూనిస్ట్‌ పార్టీ అభ్యర్థి నికోలారు ఖరిటోనోవ్‌, న్యూ పీపుల్స్‌ పార్టీకి చెందిన వ్లాడిస్లావ్‌ దావన్‌కోవ్‌, లిబరల్‌ డెమొక్రాట్‌లకు చెందిన లియోనిడ్‌ స్లట్స్కీ వరుసగా 4.31%, 3.85%, 3.20% ఓట్లు సాధించారు. వ్లాడీమీర్‌ పుతిన్‌ మొదటిసారిగా 2000 సంవత్సరంలోఅధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2008 వరకు వరుసగా రెండు, నాలుగు సంవత్సరాల పదవీకాలం పనిచేశాడు. 2008-2012 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్న డిమిత్రి మెద్వెదేవ్‌ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి అయ్యాడు. మెద్వెదేవ్‌ పదవిలో ఉన్న సమయంలో అధ్యక్ష పదవీ కాలాన్ని ఆరు సంవత్సరాలకు పొడిగించారు. మెద్వెదేవ్‌ స్థానంలో పుతిన్‌ 2012లో మరోసారి దేశాధినేత అయ్యాడు. 2018లో తిరిగి ఎన్నికయ్యారు. 2020లో ప్రధాన రాజ్యాంగ సంస్కరణలో భాగంగా రష్యా తన ఎన్నికల నిబంధనలను సవరించింది. పుతిన్‌ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక అవటానికి అడ్డంకిగా వున్న మునుపటి పదవీకాలాలను రద్దు చేసి, అతను తిరిగి ఈ సంవత్సరం పోటీ చేయడానికి వీలు కల్పించింది.ఈ ఏడాది ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ శాతం నమోదైంది. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ డేటా ప్రకారం, 2018 ఎన్నికలలోని ఓటింగ్‌ 67.47% మించి 74%కి చేరుకుంది. చెచెన్‌ రిపబ్లిక్‌, కెమెరోవో ప్రాంతం, రిపబ్లిక్‌ ఆఫ్‌ టైవాలో అత్యధికంగా 90% కంటే ఎక్కువ ఓటింగ్‌ నమోదైంది. రష్యా కొత్త ప్రాంతాలైన దొనేత్సక్‌, లుగాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్లలో, అలాగే ఖేర్సన్‌, జాపోరోజీ ప్రాంతాలలో కూడా అధ్యక్ష ఎన్నికలు మొదటిసారిగా నిర్వహించబడ్డాయి.