
– ప్రచారంలో ప్రజలకిచ్చిన హమీలన్నీ నెరవేరుస్తా
– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
నవ తెలంగాణ-మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతున్నట్లు కన్పిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.గురువారం మంథని మండలం వెంకటాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి నియోజకవర్గంలోని ఆయా పోలీంగ్ కేంద్రాల్లో జరిగిన సరళి పరిశీలిస్తే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీనే ఆదరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 80శాతం ప్రజలు కేసీఆర్ సర్కార్‌ను కోరుకుంటూ తనను ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు. ఐదేండ్లు దూరం చేసుకున్నామని, ఈసారి కాపాడుకోవాలనే మంథనినియోజకవర్గ ప్రజలు గొప్పగా ఆలోచన చేసి కారు గుర్తుకు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంథని నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హమీని నెరవేర్చుతానని, తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలంతా వందశాతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.