జానపద సంస్కృతికి ఆటపట్టులైన పుట్టిల్లు, అత్తవారిల్లు గురించి కొంత తెలుసుకుందాం. జానపద గేయ సాహిత్యంలో అత్తగారిల్లు చోటు చేసుకున్నంతగా, పుట్టిల్లు ఆ పుణ్యం చేసుకోలేకపోయింది. అయినా స్త్రీ జీవితంలో బాల్య, యౌవ్వనాలు పుట్టింట్లోనే సాధారణంగా, తియ్యగా గడుస్తాయి కనుక దాని గొప్ప దానిది. వెలుగు చీకట్లలా పుట్టిల్లు, అత్తిల్లు జీవితంలో పడుగూ పేకల్లా అమరి వుండడం సర్వసాధారణం.
పుట్టింటిని తల్చుకుంటే చాలు, ఏ స్త్రీకైనా సరే కడుపు చల్లపడుతుంది. కళ్లు చెమరుస్తాయి. ఆమె కళ్లముందు చిన్న నాటి ఆటపాటలు, పండుగలు, పబ్బాలు, సరసాలు, విరసాలు సినిమా రీళ్లలా గిర్రున తిరిగి ఆమె మనసు ఆనందంతో నిండిపోతుంది.
పుట్టింటి కళాకాంతుల గురించి కర్నాటక లంబాడీల భాషలో ఓ సామెత ఇలా వుంది…
”బాపే బనా ఘర్ సునో/ మాయే బనా చూలా సూనో/ భేనే బనా ఆంగణ సూనో”
(తండ్రి లేకపోతే ఇల్లు బోసిపోయి వుంటుంది. తల్లి లేకపోతే పొయ్యిలో నిప్పుండదు. అక్కచెల్లెళ్లు లేకపోతే ఆటపాటలు సున్న)
పుట్టిల్లు అమ్మానాన్నలతో, అన్నాతమ్ములతో, అక్కచెల్లెళ్లతో ఎప్పుడూ కళకళలాడుతూ వుండాలని పల్లెపడుచు కోరుకుంటుంది.
పుట్టిల్లు పూరిల్లైనా సరే, అది ఆడపిల్లకు రాజభవనమే. అందచందాలు వొలికే బృందావనమే. అందుకనే కర్నాటకలోని ఓ లంబాడీ స్త్రీ తన అన్నతోనో, తమ్ముడితోనో ఇలా అంటుంది…
”ఛూట్ మత్ జయేసీ హవేలీ/ మారేజ్ నాయర్ బాపురీ హేవలీ/ తారేజ్ రాజేమా ఆచోజ్ ఖాది/ ఆచోజ్ పీది హవేలీ అహీంయా”
(మా నాన్నగారి రాజభవనం నాకు దూరం కారాదు. నీ రాజ్యంలో కడుపు నిండా తిన్నాను, తాగాను)
తెలుగు జానపద స్త్రీ కూడా పుట్టింటిని పదే పదే తల్చుకుంటుంది ఇలా…
”ఆరళ్ల అత్తయిన, సవతి పోరాన/ తల్లిల్లు దూరమైన భరియించలేము”
పెళ్లయిన తర్వాత ఆడపిల్ల అత్తగారింటికి పోయి, అక్కడే కలకాలం బతకాలిగా. ఆమె ఆడపిల్లే కాని, ఈడ పిల్ల కాదుగా. ”పుట్టిల్లు పండక్కే గాని కాపరానికి కాదు’ అని కర్నాటక కోలారు జిల్లా లోని ఓ సామెత చెప్తుంది.
‘తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్లు పోయినట్లు” అని చెప్పే సామెత కూడా ఇక్కడిదే. పుట్టింట్లో తల్లి లేకపోతే ఒకవేళ సవతి తల్లి వుంటే, ఆమె నోరు విప్పలేదు. తండ్రే లేకపోతే ఆమె బతుకే చీకటి. అంటే అన్నా వదినో, తమ్ముడూ మరదలూ మాత్రమే వుండే ఆ ఆడబిడ్డకు అన్ని సుఖాలూ కొదవే.
తల్లీదండ్రీ లేకున్న పుట్టింటికి పోతే వదినమ్మ చేసిన మర్యాదకు ఓ పల్లె పడుచు ఇలా వాపోతుంది కన్నడ జానపదగేయంలో…
”అణ్ణన హెండతి కణ్ణీగె ఒళ్లెవళు/ సుణ్ణదనీర ఒలిముంద ఇటగొండు/ ఎమ్మీహాలెందు బడస్సాళ”
(అన్న భార్య చూపాకారానికి చక్కనిదే. సున్నం నీళ్లు పొయ్యి మీద కాచి, గేదెపాలని వడ్డించింది)
చూడండి.. ఆ వదినమ్మ ఆడపడుచుకు చేసిన మర్యాద ఎంత ఘనమైందో.
ఇల్లూ వాకిలీ, గొడ్డూగోదా, పొలమూ గిలమూ లేని వారికి తన బిడ్డ నిచ్చి, ఆమె బతుకు కూల్చానే అని ఓ తల్లి గొల్లుగొల్లునా ఏడ్చింది ఇలా…
”ఏమీ లేనోనికి డమ్మి తాలియాలో/ నా బిడ్డనిస్తిని డమ్మి తాలియాలో
గిట్టించుకుందునా డమ్మి తాలియాలో/ గొడ్డు లేనిటికి డమ్మి తాలియాలో/ నా బిడ్డ నిస్తినిడమ్మి తాలియాలో/ గా ముచ్చటెరుకుంటె డమ్మి తాలియాలో”
ఏ తల్లైనా సరే తన కూతుర్ని కలిగినోళ్ల ఇంటికి ఇవ్వాలనే తాపత్రయ పడుతుంది కదా. ఈ పాట నల్గొండ జిల్లాలోనిది. (నల్గొండ జిల్లా జానపద గేయాలు – సమగ్ర పరిశీలన. పేజీ.36 – 37. రచయిత : డా||మేక ఉమారెడ్డి)
ఓ ఆడబిడ్డ తన పుట్టింటికి పోయింది. అక్కడ ముగ్గురన్నలు ఆమెను ఎలా ఆదరించారో, వాళ్లిచ్చిన ప్రేమకానుకలకు ఆమె ఎలా ప్రతిస్పందించిందో చూడండి…
”పెద్దన్న ఇచ్చిన పెయ్యి ఈనీ కట్టింది/ నడిపన్న బెట్టిన నాను నడిమి కింగింది
సిన్నన్న బెట్టిన సీర సినిగిపోయింది/ పెద్దన్న ఇంట్లోనా ఏమీ కావాలి
పెద్దన్న ఇంట్లోనా పెండ్లీ కావాలి/ నడిపన్న ఇంట్లోనా ఏమీ కావాలి
నడిపన్న ఇంట్లోనా రథము కావాలి/ సిన్నన్న ఇట్లోనా ఏమీ కావాలి
సిన్నన్న ఇంట్లోనా పిల్ల సావాలి”
అంతటిదో ఆ మహాతల్లి ఆంగిందా? ఏమి శాపనార్థాలు పెట్టిందో వినండి…
”చిన్నోళ్లు పెద్దోళ్లు ఏడువంగ సూతు/ వారి చిటికనేలూకు తేలు కరవాలి”
(పై సిద్ధాంత గ్రథమే. పేజీ. 36).
రాగద్వేషాలూ, ప్రీతి విశ్వాసాలూ లేనివారెవ్వరు చెప్పండి. ఇవి కొందర్లో తక్కువగానూ, ఇంకొందర్లో ఎక్కువగానూ వుంటాయి. కోపతాపాల్ని అణచుకున్న వాళ్లు బాగుపడతారు, అణచుకోలేనివాళ్లు బాధల పాలవుతారు.
సుభద్ర తన కొడుకైన అభిమన్యునికి అన్న బలరాముని కూతుర్నిమ్మని అడిగింది ఇలా… ”పుట్టింటిలోనా కన్యా బుట్టిందనీ/ బామ నడగనా వొస్తీమో, బలరామన్న/ బామ నడగనా వొస్తీమో బలరామన్న/ సెసిరేకా సిన్నాదీ బలమంతూ డబిమన్యా బలరామన్న/ ఇద్దరికీ ఈడు లేదాన్నా, బలరామన్నా/ ఇద్దరికీ జోడి వుందన్నా బలరామన్నా”
బలరాముడు తన కూతురు శశిరేఖను తన ప్రియశిష్యుడైన దుర్యోధనుని కుమారుడు లక్ష్మణ కుమారునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడతను పాండవుల్ని ఈసడిస్తూ తన కూతుర్ని ఆ ఇంటికివ్వనన్న భావనతో చెల్లెలు సుభద్రతో ఇలా అంటాడు…
”అడవూలా అడవూలా ఆకులా మేసేటీ అడువు సెంచులూ మీరమ్మా సుబద్దరమ్మా అడువుసెంచులూ మీరమ్మా”
అప్పుడా సుభద్రమ్మతల్లి బాధతో అత్తవారింటికి వెళ్లిపోయిందే కాని అన్నయ్యకు శాపాలు వడ్డించలేదు.
సాధారణంగా పుట్టింటి వారికీ, అత్తింటి వారికీ సయోధ్య కంటే అయోధ్యే ఎక్కువ. ఆడపిల్లలు పుట్టింటిని మరవలేరు. అత్తవారింట్లో అన్నీ సజావుగా సాగుతున్నా, వాళ్లు ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఓ సారయినా పుట్టింటికి వెళ్లి అమ్మానాన్నలతో, అన్నదమ్ముళ్లతో నాలుగురోజుల పాటు కులాసాగా వుండి వస్తారు. ‘కన్నతల్లి కొంగు నీడ గానుగనీడ’ అని కర్నాటకలోని ఓ సామెత పుట్టింటి సుఖసంతోషాల్ని ఎంచక్కా చాటుతుందంటారు.
స్త్రీలు అత్తగారింటి ఆరళ్లను ఎండగట్టి ఎంత చాటి చెప్పినా, పుట్టింటి లోపాల్ని మటుకు గుండెల్లోనే దాచుకుని వుండిపోతారు.
– ఘట్టమరాజు, 9964082076