– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
– భారతరత్న రావడంపై మండలి హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు భూసంస్కరణలు అమలు చేసిన గొప్ప ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కొనియాడారు. పీవీకి భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన శాసనమండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ”తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో గొప్ప సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పాములపర్తి వెంకట నర్సింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఇది ఆనందం. ఉప్పొంగే క్షణం. అదే విధంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్, రాజకీయ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్న రావడం సతోషకరం… ” అని భట్టి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు చప్పట్లతో స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు.