అభ్యాసనా సామర్థ్యాలు పెంచేలా గుణాత్మక విద్యను బోధించాలి

Qualitative education should be imparted to enhance learning abilities– రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చిట్ల పార్థసారథి
నవతెలంగాణ-ఆర్మూర్‌
అభ్యాసనా సామర్థ్యాలను పెంపొందించేలా గుణాత్మక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సూచించారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల – జీవన్‌ రాజ్‌ పేరిట నెలకొల్పిన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వీయ పర్యవేక్షణలో బుధవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని పెర్కిట్‌లో విద్యా స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. మండలం పరిధిలోని 21 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌ ప్రధానోపాధ్యాయులకు, ఆంగ్ల మాధ్యమంలో గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులు బోధించే 140 మంది ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాల పెంపుపై స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఈ.ఆర్‌.టీ) నిపుణులతో ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. తాము బోధించే సబ్జెక్టులను ఇంగ్లీషు భాషలో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో, వారి సామర్థ్యాలను పెంపొందించేలా ఎలా బోధించాలి అనే అంశాలపై హైదరాబాద్‌ నుంచి వచ్చిన రిసోర్స్‌ పర్సన్లు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌ చైర్మెన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నప్పటికీ విద్యార్థుల్లో ప్రస్తుత పోటీ ప్రపంచ స్థాయికి తగినట్టుగా ప్రతిభ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గుణాత్మక విద్యా బోధనా, అభ్యాసనా సామర్ధ్యాల పెంపుతో పరిస్థితిలో మార్పు వస్తుందని, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన అనేక సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. గుణాత్మక విద్య పాఠశాల స్థాయిలో సాధించాలంటే ఆయా విషయాల్లో నిర్దేశించిన సామర్ధ్యాలు, అభ్యాసన ఫలితాలు ఖచ్చితంగా తరగతి గది ద్వారా మాత్రమే సాధించవలసి ఉంటుందన్నారు. పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధిస్తున్న అనేక మంది విద్యార్థులు పై చదువులకు సంబంధించిన ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో మాత్రం ప్రవేశ అర్హత పొందలేకపోతున్నారని తెలిపారు. ప్రతి ఏటా సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తుండగా, వారిలో అతికష్టంగా లక్ష మందికి మాత్రమే కొలువులు లభిస్తున్నాయన్నారు. ముఖ్యంగా పేద, దిగువ, మధ్య తరగతికి చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యా బోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బట్టీ పట్టే విధానం దూరమై, ప్రాథమిక స్థాయి నుండే అభ్యాసన ఫలితాలు, సామర్థ్యాల పెంపు దిశగా కృషి జరగాలన్నారు. ఎన్‌.సి.ఈ.ఆర్‌.టీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని అన్నారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. తాను చదువుకున్న ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల గురించి, ఇక్కడి విద్యార్థుల బాగోగుల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పడే తపన అనన్య సామాన్యమైనది కొనియాడారు. తీరిక లేని కీలకమైన విధుల్లో కొనసాగుతున్నప్పటికీ విద్యా స్ఫూర్తి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్‌ కుమార్‌, డీఈఓ దుర్గాప్రసాద్‌, డీఐఈఓ రఘురాజ్‌, డీపీఓ జయసుధ, ఎస్‌సీఈఆర్‌టీ రిసోర్స్‌ పర్సన్లు మధుసూదన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ చారి, రాజేందర్‌ కుమార్‌, ట్రస్ట్‌ కార్యదర్శి ఎన్‌.నర్సింలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.